హైదరాబాద్: గ్రూప్-4 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. గ్రూప్ 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‌ను గురువారం (నవంబర్ 14) సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కమిషన్ అభ్యర్థులకు సూచించింది.
కాగా, 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు గ్రూప్ 4 పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను నిర్వహించింది. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ.
సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఈ మేరకు గ్రూప్ 4 ఉద్యోగానికి సెలెక్టైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్ట్ గురువారం టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 8,180 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు 8,084 ఉద్యోగాలకు మాత్రమే అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. మరో 96 పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టింది టీజీపీఎస్సీ.