
తెలంగాణ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విడుదల చేసిన సోషియో ఎకనమిక్ ఔట్ లుక్ 2025లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒకట్రెండు బైకులు, ప్రతి ఐదు కుటుంబాలకు ఒక కారు ఉన్నట్లు వెల్లడించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ప్రతి ఇంటికి ఒకట్రెండు బైకులు:
రాష్ట్ర వ్యాప్తంగా 2024, డిసెంబర్ 31 నాటికి మొత్తం 1,71,20,241 వెహికల్స్ రిజిస్టర్ అయి ఉండగా.. ఇందులో 73 శాతం(1,25,86,883) టూవీలర్లే ఉన్నాయి. రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలు ఉండగా.. సగటున ఇంటికి ఒకటి కంటే ఎక్కువగానే టూవీలర్లు ఉన్నట్లు ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత అతిపెద్ద సంఖ్యలో 23,03,759 కార్లు ఉన్నాయి.
ఈ లెక్కన ప్రతి ఐదు కుటుంబాలకు ఓ కారు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే, 7,62,682 ట్రాక్టర్లు, ట్రాలీలు, 6,46,021 గూడ్స్ క్యారియర్లు, 5,08,185 ఆటోలు ఉన్నాయి. 1,40,779 మోటార్ క్యాబ్స్, 31,003 స్కూల్, కాలేజీ బస్సులు, 26,867 క్యాబ్స్, 9,071 స్టేజ్ క్యారేజెస్, 11,657 ఈ రిక్షాలు, 93,334 ఇతర వాహనాలు ఉన్నాయి.