
ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరుగుతున్న గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు ఒకే హాల్ టిక్కెట్ నెంబర్ ఇద్దరు విద్యార్ధులకు కేటాయించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఒక విద్యార్ధిని పరీక్ష కేంద్రంలోకి పంపించి మరో విద్యార్ధిని అధికారులు బయటకు పంపించేశారు. కలెక్టర్ తక్షణమే స్పందించి పరీక్ష రాయించాలని విద్యార్ధి, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం స్వర్ణభారతి కళాశాలలో ఈ ఘటన జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 5 నుంచి 9వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీల్లో ప్రవేశాల కోసం మొత్తం 51,968 సీట్లకు 1,67,649 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 5వ తరగతిలో ప్రవేశాల కోసం 88,451 మంది, 9వ తరగతిలో బ్యాక్ లాగ్ సీట్లకు 11, 871 మంది అప్లై చేసుకున్నారు. గతేడాది కంటే ఈ సారి 15 వేలు అధికంగా అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 446 సెంటర్లలో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరగనుంది.100 మార్కులకు ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.