తిండి లేదు.. నీళ్లు లేవు.. ఇండ్లన్నీ మునిగి మా బతుకులు ఆగమైనయ్

  • తిండి లేదు.. నీళ్లు లేవు..  ఇండ్లన్నీ మునిగి మా బతుకులు ఆగమైనయ్
  • గవర్నర్​ ముందు వరద బాధితుల గోస
  • సామాన్లు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయినయ్​
  • ముంపు సమస్యకు పరిష్కారం చూపాలె
  • ఆదుకునే దిక్కు లేదని కన్నీళ్లు.. ఓదార్చిన గవర్నర్​ తమిళిసై 
  • బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన
  • ఓరుగల్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

హనుమకొండ/ వరంగల్, వెలుగు:   ‘‘వరదలతోటి ఇండ్లన్నీ మునిగిపోయినయ్.. వానలు పడ్డప్పుడల్లా ఇట్లనే ఇండ్లను ఇడ్సవెట్టి పోవుడైతున్నది.. వరదలు తగ్గినంక ఇండ్లల్లకు వచ్చి చూస్తే  ఏమీ ఉంటలేదు.. తిండికి తిప్పలైతున్నది.. గుక్కెడు నీళ్లు ఇచ్చినోళ్లు లేరు.. మస్తు గోసైతున్నది. మా తిప్పలు ఇంకెవలకూ రావొద్దు’’.. ఇదీ గ్రేటర్​ వరంగల్ పరిధిలోని వరద బాధితుల గోస. పరామర్శించడానికి వచ్చిన గవర్నర్​ ముందు వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేవని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నపిల్లలకు కూడా తినడానికి ఏమీ లేక నరకం చూస్తున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. ఏటా ముంపు సమస్యతో తాము తిప్పలు పడ్తున్నా, దానికి ఎవరూ శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోయారు. వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గవర్నర్​ తమిళిసై బుధవారం వరంగల్ నగరానికి చేరుకున్నారు.  ముందుగా ఉదయం 8.40 గంటలకు వరంగల్  నిట్​కు చేరుకున్న ఆమెకు జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, గ్రేటర్​ కమిషనర్​ షేక్​ రిజ్వాన్ బాషా, ఇతర ఆఫీసర్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గవర్నర్​ హనుమకొండలోని జవహర్​ కాలనీకి వెళ్లారు. వరదలకు దెబ్బతిన్న ఆ కాలనీని పరిశీలించారు. భద్రకాళి చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు ప్రాంతమైన పోతన నగర్, ఎన్టీఆర్​ కాలనీల్లో పర్యటించారు. బాధితులను ఓదార్చి..  ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పోతన నగర్​, ఎన్టీఆర్​ కాలనీల మహిళలు తమ సమస్యలను గవర్నర్​కు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

కారులోంచి వాటర్​ బాటిల్స్​ తీసిచ్చిన గవర్నర్​

వరదల వల్ల ఇండ్లు కూలిపోయాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లలో నిల్వ ఉంచుకున్న బియ్యం, సామాన్లు కొట్టుకుపోయి.. గుక్కెడు బియ్యం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. వరదల వల్ల ఇండ్లన్నీ బురదతోనే నిండిపోయాయని, ఇప్పటికీ కాలనీల్లోంచి నీళ్లు పోలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంత ఇబ్బందిలో ఉన్నా తమకు ఏ ఒక్కరూ గుక్కెడు నీళ్లిచ్చిన పాపాన పోలేదని విలపించారు. దీంతో చలించిపోయిన గవర్నర్​ తన కారులో ఉన్న వాటర్ బాటిల్స్​ అక్కడి ప్రజలకు అందించారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకోవాలని అక్కడి ప్రజలు గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు. తమ కొడుకులు, బిడ్డలు కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయని అన్నారు. 

లీడర్లు వచ్చిపోతున్నరు అంతే..

హంటర్​ రోడ్డు సంతోషిమాత టెంపుల్​ లైన్​ లోని ఎన్టీఆర్​ నగర్​ కు గవర్నర్​ వెళ్లారు. అక్కడ కాలనీలో నీళ్లు నిలిచి ఉండగా.. కొంతదూరం వరద నీటిలోనే నడిచి కాలనీకి చేరుకున్నారు. దీంతో అక్కడి జనాలు గవర్నర్​ కు తమ సమస్యలను విన్నవిస్తూ వినతిపత్రం అందించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్​ రావు అక్కడి పరిస్థితులను గవర్నర్​కు వివరించారు. వర్షాలు పడినప్పుడల్లా ఇండ్లన్నీ నీట మునిగి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నదని,  ప్రతిసారి లీడర్లు వచ్చీ చూసి పోవడం తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని స్థానికులు గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ వంద మీటర్లు ఉండాల్సిన నాలా 20 నుంచి 30 మీటర్లే ఉందని, దీంతో ఏటా వరదనీళ్లన్నీ ఇండ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి: గవర్నర్​

ఓరుగల్లు ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వరదల వల్ల ఇక్కడి ప్రజలు తిండిలేక ఇబ్బంది పడుతున్నారని గవర్నర్​తమిళిసై అన్నారు. ఫ్లడ్​ఎఫెక్టెడ్​ఏరియాల్లోని ప్రజల పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి బాధితు లకు భరోసా ఇవ్వాలని సూచించారు. హనుమ కొండ జవహర్​కాలనీలో పర్యటించిన గవర్న ర్​ మొదట అక్కడి ముంపు బాధితులకు ఇం డియన్​ రెడ్ క్రాస్​సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మెడికల్​ కిట్లు పంపిణీ చేశా రు. అనంతరం సిటీలో ముంపు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​తో పాటు కోతకు గురైన జవహర్​కాలనీ బ్రిడ్జిని పరిశీలిం చారు. నయీమ్​ నగర్ నాలాను పరిశీలించగా.. నాలా ఆక్రమణల గురించి స్థానిక బీజేపీ కార్పొరేటర్​ చాడ స్వాతిరెడ్డి గవర్నర్​కు వివరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్​ మాట్లాడుతూ.. వరద బాధితులు కనీసం వంట చేసుకునే పరిస్థితిలో లేరని, వాళ్లను చూస్తుంటే చాలా బాధ కలుగు తున్నదని చెప్పారు. జవహర్​నగర్ బ్రిడ్జిని పునర్​నిర్మించాలని స్థానికులు గతం నుంచి కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. కొత్త బ్రిడ్జిని నిర్మిస్తే ఇంత పెద్దఎత్తున నష్టం జరగకపోయేదన్నారు. నాలాల ఆక్రమణలనూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారని గవర్నర్​ తెలిపారు. వరదల వల్ల వరంగల్​లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తున్నదని అన్నారు. తరచూ ముంపు, నష్టం జరగడానికి కారణాలపై ప్రభుత్వం స్టడీ చేసి, రాష్ట్రంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదుర వకుండా దూరదృష్టితో చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ముంపు ప్రాంతాల ప్రజ లు ఆహారం కోసం అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. ‘‘విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. అన్ని యూనివర్సిటీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి పోయిన సర్టిఫికెట్లన్నీ తిరిగి ఇచ్చేలా చొరవ తీసుకోవాలి” అని సూచించారు. వరంగల్​లో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదని, ఇక్కడి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్​ తమిళిసై స్పష్టం చేశారు.

వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కు పోతున్నది. 

వారి పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకోవాలి. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి  ఆదుకోవాలి. వర్షాలను అడ్డుకోలేం.. కానీ, వరదల వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించవచ్చు. వానలు, వరదలు తగ్గినయని రిలాక్స్​గా ఉండొద్దు. వరదల కంటే ఆ తర్వాతి పరిస్థితులే చాలా డేంజర్​గా ఉంటయ్​. దీన్ని ఎపిడమిక్  సిచ్యుయేషన్​గా పరిగణించి.. బాధితులకు భరోసా కల్పించాలి.

 గవర్నర్​ తమిళిసై