- గోదావరి - కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్
- 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు వాదన
- నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లివ్వాలి
- గొట్టిముక్కులకు ఎగువన రెండు రిజర్వాయర్లు నిర్మించండి
- సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్, దేవాదులలో 158 టీఎంసీల హక్కును కాపాడాలి
- అంతర్రాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని తెలంగాణ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి నదుల అనుసంధానంలో భాగంగా తరలించే నీటిలో సగం వాటా ఇవ్వాల్సిందేనని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మునుపటి స్టాండ్‌ను ఈసారి మరింత గట్టిగా వినిపించింది. 33 శాతం వాటాకు ఒప్పుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ విజ్ఞప్తి చేసినా.. 50 శాతానికి తగ్గకుండా నీళ్లు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయని, 75 ఏండ్లవుతున్నా ఇప్పటికీ ఆయా ప్రాంతాలకు ఇరిగేషన్ వాటర్ సౌకర్యం లేదని పేర్కొంది. ఆయా ప్రాంతాలకు నీళ్లివ్వాలంటే నీటి వాటాలో తమ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.
శుక్రవారం జలసౌధలో తెలంగాణ అధికారులతో ఎన్‌డబ్ల్యూడీఏ ఆరో సమావేశాన్ని నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు అనిల్ కుమార్, బి.నాగేందర్ రావు, సీఈలు దేవేందర్ రెడ్డి, మోహన్ రావు, కాశీ విశ్వనాథ్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వాటాల్లో ఎంత మేర లబ్ధి చేయాలో అంతకు మించి రాష్ట్రానికి చేస్తున్నామని ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పింది. పెద్దమనసుతో 33% వాటాకు అంగీకరించాలని రాష్ట్ర అధికారులను కోరింది. జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలని, అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 45 టీఎంసీలు ఇస్తామని తెలిపింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాత్రం.. అందులో 74 టీఎంసీలు ఇచ్చి తీరాల్సిందేనని, కృష్ణా బేసిన్లో ప్రస్తుతం 250 టీఎంసీల నీటి అవసరాలున్నాయని చెప్పారు. గోదావరి కావేరి లింకింగ్ ప్రాజెక్ట్‌లో నల్గొండ జిల్లాలోని గొట్టిముక్కులకు ఎగువన ఎన్డబ్ల్యూడీఏనే రెండు రిజర్వాయర్లను నిర్మించాలని కోరారు. గొట్టిముక్కులలో ఇదివరకే ప్రతిపాదించిన ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్2 ప్రాజెక్ట్‌లోని 5.30 లక్షల ఎకరాల్లో 80 వేల ఎకరాలు పోగా 4.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే సరిపోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే గొట్టిముక్కులకు ఎగువన రెండు రిజర్వాయర్లను నిర్మించి దాని ద్వారానే గోదావరి , కావేరిని లింక్ చేయాలని కోరారు. అందుకు ఎన్‌డబ్ల్యూడీఏ అంగీకరించినట్టు తెలిసింది. అలాగే, ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్నట్టు తెలంగాణలోనూ ఇంట్రా లింకింగ్ ప్రాజెక్ట్ (ఒకే రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేయడం)ను పట్టించుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ దృష్టికి అధికారులు తీసుకొచ్చినట్టు తెలిసింది.
83 నుంచి 87 మీటర్ల ఎత్తులోనే తీసుకోండి..
148 టీఎంసీల నీటి తరలింపు విషయంలో చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ సూచించగా.. ఇప్పుడే తొందరొద్దని రాష్ట్ర అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం 83 మీటర్ల ఎత్తుకే అభ్యంతరాలు చెప్తున్నందున.. 87 మీటర్ల ఎత్తు ప్రతిపాదనకు ఒప్పుకోకపోవచ్చని, ఆ రాష్ట్ర అభ్యంతరాలన్నీ తీరాకే ఒప్పందం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. సమ్మక్క బ్యారేజీలో 83 నుంచి 87 మీటర్ల ఎత్తులోనే నీటిని తరలించుకోవాలని, 83 మీటర్ల కింద నుంచి నీళ్లు తీసుకోకూడదని స్పష్టం చేశారు. తద్వారా సీతమ్మసాగర్‌లో 70 టీఎంసీలు, సమ్మక్కసాగర్‌లో 50 టీఎంసీలు, దేవాదులలో 38 టీఎంసీల చొప్పున 158 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లింకింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సమ్మక్క కన్వేయర్‌ను వాడుకోవాలని సూచించారు. 300 కిలోమీటర్ల మేర టన్నెల్, లిఫ్ట్‌లు, నీటిపారుదల ప్రాజెక్టులు, రెండు పంటలు పండే భూములున్నాయని, భూసేకరణ విషయంలో రైతుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కనుక ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్‌లోని 224 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్ల మధ్యలో సమ్మక్కలో ప్రతిపాదించిన ఎస్సారెస్పీ ఫేజ్ 2 ఆయకట్టు ఉందని గుర్తు చేశారు. వీటన్నింటికీ ఓకే చెప్పిన ఎన్‌డబ్ల్యూడీఏ.. తరలించే నీటిలో సగం వాటా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టుకు రూ.45 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్న అధికారులు.. అందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, మరో 10 శాతం ఖర్చును రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం.