సబ్సిడీలు ఎత్తేసి.. రైతు ధర్నాలా?
నిజామాబాద్, వెలుగు: రైతులకు సబ్సిడీలు ఎత్తేసిన వారే రైతు ధర్నాలు చేయడం విడ్డూరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్య నారాయణ విమర్శించారు. జిల్లా ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. రైతుల కల్లాలకు ఇచ్చిన రూ. 165 కోట్లపై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఎనభై శాతం పంటలు పండిస్తున్న కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతు ధర్నాకు డుమ్మా కొట్టారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో కూల్చివేసిన నిర్మాణాలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పత్తా లేకుండా పోయారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, నేతలు మాస్టర్ శంకర్, భాస్కర్ రెడ్డి, శివప్రసాద్, దాసరి కుమార్, అమంద్ విజయ్, ఇల్లెందు ప్రభాకర్, బురుగుల వినోద్ పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల పాదయాత్ర
ఎడపల్లి, వెలుగు: తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఫ్యాక్టరీని తెరిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రెంజల్ మండలంలోని మొలాలి తండా, తాడ్ బిలోలి, బొర్గం, సాటాపూర్ లో నాయకుడు మోహన్ రెడ్డితో కలిసి గురువారం పాదయాత్ర చేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేక సంతోశ్, ఉప్పు సురేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కోటగిరి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎంసీ నూతన చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రామ్‌రెడ్డి, పాలకర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త గా ఏర్పాటైన పాలకవర్గం రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని, రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తూ రైతులకు అండగా ఉండాలని సూచించారు. తెలంగాణా సర్కారును పడగొడతామని చెప్పే కాంగ్రెస్, బీజేపీ లు తమ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి చూపాలని స్పీకర్ పోచారం సవాలు విసిరారు. కొందరు తన కుమారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లే పల్లి సునీత, వైస్ ఎంపీపీ గంగాధర్, బీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురెంధ్ రెడ్డి, రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకుడు అన్సారీ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ దర్నా
కామారెడ్డి, వెలుగు : ఉపాధి హామీ స్కీమ్‌లో గైడ్‌లైన్స్ లేకుండానే పనులు చేపట్టి, ఫండ్స్ మళ్లించి మళ్లీ కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం నిందలు వేయటం ఏంటని బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ తీరుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామాల్లో అభివృద్ధి కోసం వాడే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయటం తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఉపాధి ఫండ్స్‌తో రైతు వేదికల నిర్మాణం చేపట్టి ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టలేదన్నారు. జిల్లాలో 1,693 కల్లాలకు రూ.12.23 కోట్ల ఫండ్స్ ఖర్చు చేశారన్నారు. దీనిపై జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి వచ్చిన చర్చకు తాను రెడీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, టౌన్ ప్రసిడెంట్ విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్పాల్గొన్నారు.
పల్లెల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ వెలుగు: పల్లెల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, కమ్మర్పల్లి , ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, రూ. వందల కోట్ల నిధులను మంజూరు చేస్తూ పల్లె ప్రాంతాల రోడ్లను అద్దాల్లా మెరిపిస్తున్నారని అన్నారు. గ్రామాలకు రోడ్ల నిర్మాణాలకు 40 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని అన్నారు. ముఖ్యంగా దేవక్కపేట్ - తాటిపల్లి రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల కల నెరవేరుతోందని మంత్రిచెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో గిరిజన జనాభా అధికంగా గల గ్రామీణ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడి, ఆయా ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో డీపీఓ జయసుధ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావ్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జెడ్పి కో ఆప్షన్ సభ్యుడు మొయిజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వీఆర్వోకు మూడేండ్ల జైలు
నిజామాబాద్ టౌన్, వెలుగు : లంచం తీసుకున్న కేసులో నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన వీఆర్వో బంగారు హనుమాన్లు కు ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి పి .లక్ష్మీ కుమారి మూడు సంవత్సరాల శిక్ష, రూ. 15 వేల జరిమానా విధించింది. బినోలకు చెందిన గొట్టి ముక్కుల వెంకటి సాగు చేసుకుంటున్న 2.20 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి, ఒక ఎకరం పట్టాదారు పాసు పుస్తకం టైటిల్ తాహసీల్దార్ ఆర్డర్ కాపీ ఇవ్వడానికి వీఆర్వో రూ.10 వేల లంచం డిమాండ్ చేశారని, లంచం తీసుకుంటుండగా అక్టోబర్ 31, 2013లో నిజామాబాద్ ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి శనివారం తీర్పును వెల్లడించారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు : మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, వెలుగు: పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో డీసీసీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ ప్రభుత్వం కరోనా పేరుతో యాత్రను ఆపాలని చూస్తోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ హమీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. జోడో యాత్ర ముగింపు రోజు జనవరి 26 నుంచి మార్చ్ 26 వరకు ప్రతి నియోజక వర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత డీసీసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈరవత్రి అనిల్, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామర్తి గోపి తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
భిక్కనూరు,వెలుగు: మండలంలోని అంతంపల్లిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిచంద్రకాంత్ రెడ్డి,సుధాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని మాజీ మంత్రి షబ్బీర్ఆలీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటూ.. లక్షల కోట్లకు ఎదిగిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9వస్తువులతో రేషన్ బియ్యాన్ని అందించామని, ఇప్పుడు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ దేశాన్ని దోచుకుంటే, బీఆర్‌ఎస్ రాష్ర్టన్ని దోచుకుంటుదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి,మండలాధ్యక్షుడు బీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.