- రూ.1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు
- పలుమార్లు పీఎం, కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్, మంత్రులు
- తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్
- మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్స్‌లో ఏ ఒక్కదానినీ పట్టించుకోలే
- పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చటే లేదు
- ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం కేటాయింపులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోసారి వివక్ష చూపింది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులుగానీ, కొత్త ప్రాజెక్టులుగానీ కేటాయించలేదు. ఏపీలోని పోలవరానికి దండిగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం మన పాలమూరు–- రంగారెడ్డికి మాత్రం పైసా ఇవ్వలేదు. అక్కడి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పెద్దమొత్తంలో ఫండ్స్ కేటాయించి, మన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పక్కనపెట్టింది. ఎప్పట్లాగే 2014 నాటి విభజన హామీల ఊసే ఎత్తలేదు. గత బీఆర్ఎస్ సర్కారు.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఏనాడూ సఖ్యంగా లేదు.
దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంగా మోదీ సర్కారుతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. సహాయం చేయాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో చేపడ్తున్న పలు కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తరఫున రూ.1.63 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించారు. తొలివిడత కింద తాజా బడ్జెట్లో కనీసం రూ.40 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆ ప్రతిపాదనలను మోదీ సర్కారు బుట్టదాఖలు చేసింది.
రూ.40 వేల కోట్లు అడిగితే పైసా ఇయ్యలే..
హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రేవంత్సర్కారు చేపట్టింది. ఇందులో ఫ్యూచర్‌సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్, మెట్రో సెకండ్‌ఫేజ్, గోదావరి– మూసీ లింక్ ప్రాజెక్టు, స్కిల్యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.14,100 కోట్లు, రీజినల్రింగ్రోడ్డుకు రూ.34,367 కోట్లు, మెట్రో రెండోఫేజ్ కు రూ.24,269 కోట్లు, గోదావరి- మూసీ నదుల లింక్‌కు రూ.7,400 కోట్లు, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సీవరేజీ మాస్టర్ ప్లాన్ల కోసం వరుసగా రూ.17,212 కోట్లు, రూ.4,170 కోట్లు, 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతోపాటు ఓఆర్ఆర్ ను అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఫ్యూచర్‌సిటీని కూడా కలుపుకుంటే మొత్తం రూ.1.63 లక్షల కోట్లు అవసరమని కేంద్రం దృష్టికి సీఎం రేవంత్తెచ్చారు. ఇందుకు ఈసారి బడ్జెట్లో రూ.4వేల కోట్ల సాయం అందించాలని మోదీ, కేంద్రమంత్రులకు పలుమార్లు విజ్ఞప్తిచేశారు.
ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల 27 మున్సిపాలిటీల్లో 7,444 కిలోమీటర్ల సీవరేజీ నెట్‌వర్క్ పనుల ప్రాధాన్యతను వివరించి.. అమృత్ 2 లేదంటే ప్రత్యేక ప్రాజెక్టు కింద ఫండ్స్ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనను సైతం ఎన్డీయే సర్కారు పట్టించుకోలేదు. ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా ఏర్పాటుచేసిన స్పోర్ట్స్యూనివర్సిటీకి గానీ, యూత్‌లో స్కిల్స్ పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న స్కిల్యూనివర్సిటీకి కానీ కేంద్రం సహకరించలేదు. పైగా ఒకేసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాల్లో ఏపీని ఒకలా.. తెలంగాణను మరోలా చూసింది. మన పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా.. సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అదే పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ఇచ్చింది. విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేకపోగా, ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తాజాగా మరో రూ.3,295 కోట్లు కేటాయించింది. తెలంగాణకు డ్రై పోర్టు మంజూరు చేయాలని ప్రభుత్వం కోరినా పట్టించుకోలేదు. అదే విశాఖ పోర్టుకు మాత్రం రూ.730 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్ – శ్రీశైలం, హైదరాబాద్–- విజయవాడ, వరంగల్ బైపాస్ నిర్మాణం, పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి, హనుమకొండ, నాగార్జుసాగర్ కు ప్రాధాన్యం, గోదావరి, కృష్ణా నదులపై పది పాంటూన్ బ్రిడ్జిల నిర్మాణం కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడిగినా ఏఒక్కటీ ఇవ్వలేదు.
ఐఐటీ.. ఐఐఎం.. నవోదయ ఏదీ లేదు!
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్‌లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1,800 కోట్లు రావాల్సి ఉంది. ఇవి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈసారి కూడా వీటి ఊసులేదు. విభజన సమస్యలపైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్స్ స్కూల్స్మంజూరు చేయాలని కోరినప్పటికీ కేంద్రం కరుణించలేదు. ఆర్థిక వృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ కీలకమైన ఎంఎస్ఎంఈలకు ఒకపాలసీని తీసుకొచ్చి.. వాటికి పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తున్న తెలంగాణకు ఎలాంటి ప్రోత్సాహకాన్ని బడ్జెట్ లో ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ ఉన్నతాధికారి‘ వెలుగు’తో వాపోయారు. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టుపై ఈసారి కూడా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద ఈ సారైనా తెలంగాణకు విభజన హామీలు, నిధులు, కొత్త ప్రాజెక్టులు దక్కుతాయని ఎదురుచూసిన ప్రజలకు యూనియన్బడ్జెట్తీవ్ర నిరాశను మిగిల్చింది.
బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి కేటాయింపులు ఇలా..
తెలంగాణ కేటాయింపులు..
ప్రాజెక్ట్ లు 2024–25 2025–26
సింగరేణి కాలరీస్ రూ. 1600 కోట్లు రూ. 1700 కోట్లు
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్
ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ రూ. 376.65 రూ. 387.50 కోట్లు
నేషనల్ ఇనిస్టిట్యూస్ ఆఫ్ రూరల్
డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రూ. 73.68 కోట్లు ఒక లక్ష
ఏపీకి కేటాయింపులు..
ప్రాజెక్ట్ లు 2024–25 2025–26
పోలవరం ప్రాజెక్ట్ రూ.5, 512.50 కోట్లు రూ.5,936 కోట్లు
విశాఖ పోర్ట్ రూ.285 కోట్లు రూ. 730 కోట్లు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ రూ.8,622 కోట్లు రూ.3,295 కోట్లు