హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోమారు గుండు సున్నా దక్కింది. 2024 మాదిరిగానే 2025 కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించి ఇచ్చినా.. కేంద్రం ఆ కనీస కృతజ్ఞతను మరిచి మరోమారు మొండి చెయ్యే చూపింది. గతేడాది భంగపాటు ఎదురైనా ఈసారైనా తెలంగాణకు విభజన హామీలు, నిధులు దక్కుతాయని ఎదురుచూడగా.. మళ్లీ నిరాశే మిగిలింది.
లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కొత్తగా దక్కిందంటూ ఏమీ లేకపోగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కోరినా బడ్జెట్లో ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కేంద్రం నుంచి సుమారు రూ.30 వేల కోట్లను గ్రాంట్ల రూపంలో తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ పథకాలు సవ్యంగా అమలయ్యేందుకు, నిధులు లేమితో పథకాల అమలులో జాప్యం జరగకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ కేంద్రాన్ని గ్రాంట్లను కోరింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను రూ.21,636 కోట్లుగా ప్రభుత్వం చూపింది. అయితే.. గత 9 నెలల్లో కేవలం రూ.4,771 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణకు గ్రాంట్ల రూపంలో వచ్చాయి.
ఎప్పట్లాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులే తప్ప ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కిందేమీ లేదు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం సహా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు కోరింది.
ALSO READ | దేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ
బడ్జెట్ చూశాక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.14 వేల కోట్ల ఫండింగ్ కోరింది. దశలవారీగా అయినా ఈ నిధులను కేటాయిస్తే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ముందుకు వెళుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశించింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఆశించి భంగపడ్డ అంశాలివి:
* కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులు ఆశించి తెలంగాణ భంగపడింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణకు బడ్జెట్లో నిధులు ఆశించగా నిరాశే మిగిలింది.
* ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు దక్కాల్సిన నిధులను ప్రభుత్వం ఆశించగా కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
* గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన ఉంచింది. హైదరాబాద్ నగరంలో తాగునీటికి రానురానూ డిమాండ్ పెరుగుతుందని, గోదావరి జలాలను తరలించడంతో పాటు మూసీ నది జలాలను శుద్ధి చేస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుందని కేంద్రానికి ప్రభుత్వం తెలిపింది. ఈ అంశాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు.
* హైదరాబాద్ చుట్టూ రీజినల్రింగ్రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు చేయూత, మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కేంద్రం ఈ ప్రతిపాదనలను పెడ చెవిన పెట్టింది.
* ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) నిధులు వస్తాయి. ఇవి దేశంలోని ప్రతీ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందేవే. కొత్తగా తెలంగాణకంటూ కేంద్రం బడ్జెట్లో చేసిన మేలు ఏం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా.