- గోదావరి, కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ
- సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా అంగీకరించం
- సమ్మక్క సాగర్ నుంచే అనుసంధానం చేయాలని స్పష్టీకరణ
- లింకింగ్ ద్వారా తరలించే నీటిలో సగం ఇవ్వాలని డిమాండ్
- సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి
- నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లోని 1050 టీఎంసీలపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు తేలేదాకా గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. నీటి వాటాలు తేలకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. దాని వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా జలాల్లో వాటా తేలిన తర్వాత సమగ్ర అధ్యయనం (సిమ్యులేషన్ స్టడీస్) చేసి ఇబ్బందుల్లేవని స్పష్టమైతేనే ముందుకెళ్లాలని వివరించింది. సోమవారం నదుల అనుసంధానంపై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, తెలంగాణ నుంచి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ సీఈ మోహన్ కుమార్, ఏపీ నుంచి హైడ్రాలజీ సీఈ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించేది లేదన్న మునుపటి స్టాండ్‌నే తెలంగాణ కొనసాగించింది. ఇచ్చంపల్లికి కేవలం 24 కిలోమీటర్ల దిగువలోనే తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సడన్‌గా వరద వస్తే దానిని నియంత్రించే పరిస్థితుల్లేవని తెలిపింది. ఇటు ఫ్లడ్ రూటింగ్కూ ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మార్చి 6న రాసిన లేఖలోని తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈఎన్సీ అనిల్ కుమార్ చెప్పారు. కాగా, సమ్మక్కసాగర్, ఇచ్చంపల్లిపై చత్తీస్‌గఢ్ అభ్యంతరాలు లేవనెత్తడంతో కొత్తగా ఇంద్రావతి నదిపై రిజర్వాయర్ కట్టే అంశమూ తెరపైకి వచ్చింది.
దిగువ ప్రాజెక్టులకు నీరెలా?
ఇచ్చంపల్లికి దిగువన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీల చొప్పున మొత్తం 158 టీఎంసీల నీటి విని యోగం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే గోదావరి కావేరి అనుసంధానంతోపాటు ఆయా ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తామని తెలం గాణ అభ్యంతరం తెలిపింది. ‘‘అనుసంధానంలో భాగంగా తొలిదశలో తరలించే 148 టీఎంసీల్లో 16 టీఎంసీలను కర్నాటకకు కేటాయిస్తున్నారు. ఆ నీటిని కృష్ణా బేసిన్‌లోని సబ్ బేసిన్ కే4(మలప్రభ)లోని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి వాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే.. దాని దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలపై ప్రభావం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులు సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న రాష్ట్రా లు వినియోగించడానికి వీలు కల్పించారు. అందులో 21 టీఎంసీలు కర్నాటక, 14 మహారాష్ట్ర అడుగుతున్నాయి. వాటికితోడు మరో 16 టీఎంసీలను కేటాయిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది’’ అని పేర్కొంది.
సగం నీళ్లివ్వాలి..
గోదావరి కావేరి నదుల అనుసంధానంలో తరలించే జలాల్లో సగం వాటాను కేటాయించాలని తెలంగాణ తేల్చి చెప్పింది. పాలమూరులో 30 లక్షల ఎకరాలు, నల్గొండలో 20.3 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలోని 12.2 లక్షల ఎకరాల సాగు భూముల్లో 86 శాతానికిపైగా నీటి వసతి లేద ని, ఆయా జిల్లాలకు నీళ్లివ్వాలంటే సగం వాటా తమకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేసింది. కర్నాటకలోని బెడ్తి వార్దా నదుల అనుసంధానంలో తరలించే 18 టీఎంసీల్లో 9 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ తేల్చి చెప్పింది. గోదావరి బేసిన్లో 968 టీఎంసీల నికర జలాలున్నాయని, ఇప్పటికే అందుకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకున్నామని వివరించింది. ఆయా ప్రాజెక్టులపై ప్రభావం చూపకుండా నదుల అనుసంధానంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. సీతారామ ఎత్తిపోతల పథకం సీతమ్మసాగర్ బ్యారేజ్ బహుళార్ధకసాధాక ప్రాజెక్టుతో పాటు సమ్మక్కసాగర్ బ్యారేజీ డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటికి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
చత్తీస్‌గఢ్ అభ్యంతరం
ఇచ్చంపల్లి బ్యారేజీకిగానీ.. దానికి దిగువన తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్కసారక్క బ్యారేజీలకుగానీ తాము అంగీకరించబోమని చత్తీస్‌గఢ్ పేచీ పెట్టింది. ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తులో కట్టినా.. సమ్మక్క సాగర్ బ్యారేజీని 83 మీటర్ల ఎత్తులో కట్టినా తమ రాష్ట్రంలో ముంపు సమ స్య తీవ్రంగా ఉంటుందని ఆక్షేపించింది. ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్ నుంచి గోదావరి కావేరి అను సంధానంలో సమస్యలు ఉన్నాయని, పోలవరం నుంచి గోదావరి అనుసంధానానికి తాము ఒప్పు కుంటామని ఏపీ చెప్పింది. పలు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలపడం, కొన్ని రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో ప్రభావిత రాష్ట్రాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్లపై అభ్యంతరాలుంటే కొత్తగా ఇంద్రావతిపై రిజర్వాయర్ కట్టి నీటిని తరలించే ప్రతిపాదననూ పరిశీలిస్తామని చెప్పారు.