- మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల దాకా జరిగిన ప్రక్రియ
- పోస్ట్‌మార్టం మొత్తం వీడియో చిత్రీకరణ
- హైకోర్టు ఆదేశాలతో డెడ్‌బాడీలను భద్రపరిచిన పోలీసులు
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు : ఏటూరునాగారం మండలం చల్పాక వద్ద ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు సోమవారం సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం పూర్తి అయింది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం చేయగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ప్రక్రియ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పోస్టుమార్టం ప్రక్రియను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు లక్ష్మణరావు, ఖాజా మొయినొద్దీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేందర్, నవీన్, పీజీ డాక్టర్లు మాధురి, మౌనిక, నవీన్, జితేందర్ నిర్వహించగా ఏటూరునాగారం, మంగపేట తహసీల్దార్లు జగదీశ్వర్, రవీందర్ పర్యవేక్షించారు.
ములుగు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం ప్రక్రియ జరుగగా, పలువురు సీఐలు, ఎస్సైలతో సహా 100 మంది పోలీసులతో నాలుగు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏగోలపు మల్లయ్య కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు వస్తుండగా ఐటీడీఏ ములమలుపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మల్లయ్య భార్య మీన, అతడి అన్న రాజయ్యను మాత్రమే మార్చురీ వద్దకు అనుమతించారు. అయితే ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు డెడ్‌బాడీలను భద్రపరచాలని ఆదేశించడంతో పోస్ట్‌మార్టం పూర్తి అయిన అనంతరం సీహెచ్‌సీలోని మార్చురీలో భద్రపరిచారు.
ఆరుగురు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారే..
చల్పాక ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు చనిపోగా, ఇందులో ఆరుగురిది చత్తీస్‌గఢ్ రాష్ట్రమే. మహాదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా కార్యదర్శి ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు మాత్రమే తెలంగాణకు చెందిన వ్యక్తి. ఈయనది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామం. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇల్లందు, నర్సంపేట ఏరియా కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్నది చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చెరమంగి గ్రామం కాగా దళ సభ్యులు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్‌ది బీజాపూర్ జిల్లా తంబెల్బట్టి గ్రామం. ముస్సాకి జమునది బైరాంగర్ మండలం పోరోవాడక కాగా జైసింగ్‌ది ఇంద్రావతి ప్రాంతం, కిశోర్‌ది బీజాపూర్ జిల్లా గంగులూరు గ్రామం పాంపాడ్, కామేశ్‌ది బీజాపూర్ జిల్లా ఊసూర్ గ్రామం అని పోలీసులు ప్రకటించారు.
ముమ్మాటికీ ౠటకపు ఎన్‌కౌంటర్
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో ఆదివారం జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్. పోలీసులు అన్నంలో మత్తు మందు కలిపి, మత్తులో ఉన్న వారిని కిరాతకంగా కొట్టి చంపేశారు. తర్వాత ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు. నా భర్త మధు (మల్లయ్య) మృతదేహాన్ని దగ్గరుండి చూసిన. అతడిపై ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.
మీన, మల్లయ్య భార్య
చిత్రహింసలు పెట్టి చంపినట్లుంది
మావోయిస్టులపై విషప్రయోగం చేసి, చిత్రహింసలు పెట్టి చంపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలసి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బూటకపు ఎన్‌కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల ముఖాలపై కెమికల్ చల్లారు. దీంతో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేకుండా ఉన్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్ కాబట్టే ఘటనాస్థలానికి మీడియాను కూడా అనుమతించలేదు. మృతుల కుటుంబ సభ్యులకు కూడా డెడ్‌బాడీలను చూపించడం లేదు.
బొప్పూడి అంజమ్మ, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు