ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడ్డుకోలేం

ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడ్డుకోలేం
  • ఓటింగ్‌‌‌‌లో పాల్గొనకుండా ఉత్తర్వులు ఇవ్వలేం
  • కేఏ పాల్‌‌‌‌ మధ్యంతర పిటిషన్‌‌‌‌ను డిస్మిస్‌‌‌‌ చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు శాసనసభలో జరిగే ఓటింగ్‌‌‌‌లో పాల్గొనకుండా, సభలో జరిగే వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ప్రజాశాంతి పార్టీ చీఫ్‌‌‌‌ కేఏ పాల్‌‌‌‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు స్పీకర్‌‌‌‌ ఎదుట విచారణలో ఉన్నందున తాము మధ్యంత ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

తగిన సమయంలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ పూర్తి చేయాలని తాము ఇటీవలే ఆదేశాలను జారీ చేశామని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్‌‌‌‌ అభ్యర్థనను ఆమోదించలేమని వెల్లడించింది. స్పీకర్‌‌‌‌ నిర్ణయం తీసుకోకముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌‌‌‌రావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.