హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని, దీనికి నిర్మాతలు సహకరించాలని ఆదేశించింది. పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో నిర్మాతలు రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ సంఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధంలేదని, వారు పిటిషనర్లు కేవలం నిర్మాతలు మాత్రమేనన్నారు. హీరో అల్లు అర్జున్ రాకపై తమ కార్యాలయ సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే పిటిషనర్లను అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు, పిటిషనర్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన థియేటర్ మేనేజర్ అడ్ల శరత్ చంద్రనాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్, శ్రీరాములు రాజుకు బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది.