వీసీగా చక్రపాణి నియామకంపై కౌంటర్‌‌‌‌ వేయండి:హైకోర్టు

వీసీగా చక్రపాణి నియామకంపై కౌంటర్‌‌‌‌ వేయండి:హైకోర్టు

రాష్ట్రానికి, యూజీసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: డాక్టర్‌‌‌‌ బి.ఆర్‌‌‌‌. అంబేద్కర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ యూనివర్సిటీ వైస్‌‌‌‌ చాన్స్ లర్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, యుజీసీలకు, వీసీగా నియమితులైన డాక్టర్‌‌‌‌ చక్రపాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

వీసీగా డాక్టర్‌‌‌‌ ఘంటా చక్రపాణికి అర్హతలు లేవని పేర్కొంటూ హనుమకొండకు చెందిన మాజీ అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ బి. కుమారస్వామి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ గురువారం  విచారించారు.

ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ గ్రాంట్స్‌‌‌‌ కమిషన్లతోపాటు వీసీ చక్రపాణికి నోటీసులు జారీ చేశారు. 

తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. చక్రపాణిని వీసీగా నియమిస్తూ 2024 డిసెంబరు 6న జారీ చసిన జీవోను రద్దు చేయాలని, యుజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకం ఉందన్నారు.  

రాజ్యాంగంలోని అధికరణ 319(బి) ప్రకారం చక్రపాణికి అర్హత లేదన్నారు.  2014 నుంచి 2020 వరకు తెలంగాణ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా చేశాక తిరిగి ప్రొఫెసర్‌‌‌‌గా పనిచేశారని, ప్రొఫెసర్‌‌‌‌గా ఎనిమిదేండ్ల సర్వీస్‌‌‌‌ మాత్రమే చక్రపాణికి ఉందన్నారు. 60 ఏండ్ల వయోపరిమితి కూడా దాటిపోయిందన్నారు.