ఎంపీ, ఎమ్మెల్యేలకు సమన్లు ఇవ్వండి : హైకోర్టు

ఎంపీ, ఎమ్మెల్యేలకు సమన్లు ఇవ్వండి : హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న కేసుల్లో సమన్లు జారీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమన్ల జారీకి తీసుకున్న చర్యలపై రిపోర్టు ఇవ్వాలని చెప్పింది. అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను సత్వర విచారణ చేయాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. దీనిని సుమోటో పిటిషన్‌గా తీసుకుని హైకోర్టు ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

హైకోర్టు రిజిస్ట్రీ తరఫు సీనియర్‌ లాయర్‌‌ జి.విద్యాసాగర్‌ హైకోర్టుకు స్టేటస్‌ రిపోర్టు ఇచ్చారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా నేతలపై 115 కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ రిపోర్టును పరిశీలించిన హైకోర్టు.. కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తిం చేసింది. నిందితులకు, సాక్షులకు సమన్లు జారీ చేయడంలో జాప్యం ఎందుకు అవుతోందని ప్రశ్నించింది.

నెల రోజుల్లో కేవలం 9 సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ఆక్షేపించింది. కళ్ల ముందే ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుతున్నా సమన్లు ఎందుకు జారీ చేయడం లేదని నిలదీసింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ జోక్యం చేసుకొని.. సమన్లు జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరాల సమర్పించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో విచారణ ఈ నెల హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది.