
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేయాలంటూ సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి, తీర్పును తర్వాత చెబుతామని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆదేశించిన మేరకు హరీశ్‌రావును అరెస్టు వద్దన్న ఉత్తర్వులు అప్పటి వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదిస్తూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఆజ్ఞల మేరకే చక్రధర్‌గౌడ్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్నారు. కేసు నమోదైతే ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోకుండా నేరుగా కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం చెల్లదన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. నిందితులను పోలీసులు హించారని పిటిషనర్ న్యాయవాది చెప్పడం వాస్తవం కాదన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్లు దామ శేషాద్రి నాయుడు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వాదిస్తూ.. నిందితులను భయపెట్టి హరీశ్‌ను కేసులో ఇరికించే విధంగా వాంగ్మూలాలను నమోదు చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.