
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్యారోగ్య శాఖకు రూ.12,393 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌లో 4.06 శాతం నిధులు వైద్యారోగ్య శాఖకు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే 8 శాతం నిధులు పెంచింది. పోయినేడాది హెల్త్ శాఖకు రూ.11,468 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 925 కోట్లు ఎక్కువగా కేటాయించింది. నిర్వహణ పద్దు కింద రూ.5,067 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.6,726 కోట్లు ప్రతిపాదించింది.
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ప్రగతి పద్దు కింద వెయ్యి కోట్లు అధికంగా కేటాయింపులు చేసింది. ఇక కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు రూ.1,686 కోట్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు రూ.3,010 కోట్లు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు రూ.1,252 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ తదితరాలపై బడ్జెట్‌లో దృష్టి పెట్టింది.
ఆరోగ్య శ్రీకి రూ.78 కోట్లు పెంపు..
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఆరోగ్య శ్రీకి నిధులు పెంచారు. ఈ ఏడాది ఆరోగ్య శ్రీకి రూ.1,143 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.1,065 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.78 కోట్లు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ప్యాకేజీల ధరలను పెంచడంతో పాటు కొత్తగా 160 చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఆరోగ్యశ్రీ కింద ఉన్న రూ.1,215 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.84 కోట్ల మంది వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు.
మందుల కొనుగోలుకు రూ.377 కోట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ పరికరాల కొనుగోలు కోసం రూ.200 కోట్లు, మందుల కొనుగోలు కోసం రూ. 377 కోట్లు, న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.167 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. పీహెచ్‌సీల అభివృద్ధికి రూ.50 కోట్లు, 108 సర్వీసెస్ కోసం రూ.30 కోట్లు, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ కోసం రూ.94 కోట్లు ప్రతిపాదించారు. టీవీవీ హాస్పిటల్స్ ఆధునీకరణ కోసం రూ.164 కోట్లు, టీవీవీ హాస్పిటల్స్‌లో ఎక్విప్మెంట్స్ కొనుగోలు కోసం రూ.100 కోట్లు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సర్వీసుల కోసం రూ.118 కోట్లు కేటాయింపులు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో రోగుల సహాయకులకు సబ్సిడీ ఫుడ్ అందించేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. నిమ్స్ ఆస్పత్రిలో భవనాల నిర్మాణానికి రూ.50 కోట్లు, అత్యవసర పరికరాల కొనుగోలుకు రూ.16 కోట్లు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగుల చికిత్స నిమిత్తం రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.74 కోట్లు కేటాయించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో భవన నిర్మాణం కోసం రూ.4 కోట్లు, క్యాన్సర్ నియంత్రణ కోసం రూ.4 కోట్లు కేటాయింపులు చేశారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.565 కోట్లు
మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలకు పక్కా భవనాలు లేవు. అవన్నీ అరకొర వసతులతో రేకుల షెడ్డు, కిరాయి బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్‌కు హాస్టల్ వసతులు లేక ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.565 కోట్లు కేటాయించింది.
గతేడాది మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.542 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.23 కోట్లు అధికంగా కేటాయించింది. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి స్కాలర్‌షిప్స్, స్టైఫండ్స్ తదితరాల కోసం రూ.292 కోట్లు కేటాయించింది.