ఒమిక్రాన్‌పై హైకోర్ట్ ఆదేశాలను గౌరవిస్తామన్నారు..హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు. కోర్ట్ ఆర్డర్ కాపీ ఇంకా తనకు అందలేదని.. అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒమిక్రాన్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుర్గాభాయ్ దేశముఖ్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు హరీశ్. బూస్టర్ డోస్ , చిన్న పిల్లల వాక్సినేషన్ పై కేంద్రం స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్ ఇవ్వాలని చెబుతున్నా.. కేంద్రం నుంచి స్పందన లేదన్నారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు పెట్టాలని ఆదేశించింది కోర్టు. రెండు మూడు రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది. జనం గుమిగూడకుండా చూడాలని సూచించింది. అలాగే ఎయిర్ పోర్ట్ లో మాదిరిగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు తీసుకుంటున్న కోవిడ్ నిబంధనలు... తెలంగాణలోనూ అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. దీంతో రాష్ట్రప్రభుత్వ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది.. న్యూఇయర్, క్రిస్మస్ పై ఎలాంటి ఆంక్షలు పెట్టబోతుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పై విధంగా కామెంట్ చేశారు.