చిట్టి తల్లికి.. ఆరోగ్య మంత్రి అండ .. వెలుగు కథనానికి స్పందించిన దామోదర రాజనర్సింహ

చిట్టి తల్లికి.. ఆరోగ్య మంత్రి అండ ..  వెలుగు కథనానికి స్పందించిన దామోదర రాజనర్సింహ
  • పాపకు అవసరమైన వైద్య సేవలు అందించేలా అధికారులకు ఆదేశం
  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన  పాప కృతిక పేరెంట్స్

హైదరాబాద్, వెలుగు:  బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి ఎంత ఖర్చయినా అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ‘వెలుగు’పత్రికలో ఆదివారం పబ్లిష్ అయిన ‘చిట్టితల్లికి.. పెద్ద జబ్బు’ కథనానికి మంత్రి స్పందించారు. వెంటనే పాప తండ్రి విజయ్‌కుమార్‌‌తో పాటు బసవతారకం హాస్పిటల్ యాజమాన్యంతో వైద్య శాఖ అధికారులు మాట్లాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి.. ట్రీట్ మెంట్ కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాప కృతిక పేరెంట్స్ గౌరి విజయ్, రాణి..  ఆరోగ్య మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.  

నాగర్‌ కర్నూలు జిల్లాకు చెందిన విజయ్ కూతురు కృతిక కొద్దినెలల కింద క్యాన్సర్ బారిన పడడంతో  హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇదివరకే సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు కోసం ప్రభుత్వం ఎల్‌వోసీ ఇచ్చింది. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం మరో రూ. 25లక్షలు అవసరం పడతాయని డాక్టర్లు చెప్పారు. దీంతో నిరుపేద కుటుంబ ఆర్థిక పరిస్థితిపై వెలుగు పత్రికలో వచ్చిన కథనానికి మంత్రి స్పందించి పాపకు అన్ని రకాల వైద్య సేవలు అందించేలా అధికారులను ఆదేశించారు.