సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ..ఇవాళ( డిసెంబర్ 18న) విచారించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది.
షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27న జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ర్టేటివ్, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఇంధనశాఖ హైకోర్టులో పిటిషన్వేసినట్లు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు ఇప్పుడు యూనియన్ ఎన్నికలు జరిగితే అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ గెలుపొటములపై ప్రభావం చూపుతుందని భావించే సర్కారు కోర్టును ఆశ్రయించిందని ఇతర కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది.
సింగరేణి ఎన్నికలపై ఎమ్మెల్యేలతో మంత్రి మీటింగ్
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై మంత్రి శ్రీధర్‌బాబు డిసెంబర్ 14న అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో కోల్ బెల్ట్ప్రాంత ఎమ్మెల్యేలు, ఐఎన్టీయూసీ నాయకులతో సమావేశమయ్యారు. ఐదు పార్లమెంట్, 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అన్ని డివిజన్లలో ఐఎన్ టీయూసీని గెలిపించాలని మంత్రి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్‌లో కాంగ్రెస్‌పార్టీ సత్తా చాటిందని, కార్మిక సంఘం ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగించాలని అన్నారు. గతంలో రెండుసార్లు బీఆర్ఎస్అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ఎన్నికల్లో గెలిచిందని, ఈసారి ఐఎన్టీయూసీని గెలిపించడమే టార్గెట్‌గా ప్రతి ఎమ్మెల్యే పని చేయాలని సూచించారు.