వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై హైకోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా అని ఆగ్రహించింది. పీసీబీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని ప్రభుత్వంపై  హైకోర్టు మండిపడింది. హైకోర్టు ప్రశ్నలకు సమాధానంగా.. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ.. లక్ష విగ్రహాలను ఉచితంగా ఇస్తున్నామన్న ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వ వ్యాఖ్యలు విన్న కోర్టు.. సలహాలు కాదు.. స్పష్టమైన చర్యలు, మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం చొరవ చూపకుంటే.. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.