- జూబ్లీహిల్స్ సొసైటీ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డిగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవహారాలపై విచారణాధికారి గడువు దాటిన తరువాత నివేదిక సమర్పించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల నివేదిక అమలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలకమండలి వ్యవహారాలపై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ న్యాయవాది కె.రమేశ్‌చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..విచారణాధికారి సెప్టెంబరు 7న నివేదిక సమర్పించారన్నారు.
గత పాలక మండలి నుంచి రూ.17.17 కోట్లు, రూ.23.42 లక్షలు వసూలు చేయాలని సహకార సంఘ కమిషనర్‌కు సూచిస్తూ నివేదిక సమర్పించారని తెలిపారు. 2022 మార్చి 23న విచారణాధికారి నియామకం జరిగిందని, విచారణ గడువును నవంబరు 19వ తేదీ వరకు పొడిగించారన్నారు. 6 నెలలకు మించి గడువు ఇవ్వరాదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. 2022 నవంబరు 18న విచారణ నివేదిక సమర్పించినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నప్పటికీ రికార్డుల్లోని నివేదికలో తేదీ లేకపోవడాన్ని తప్పుబట్టారు. నవంబరు అనుకున్నప్పటికీ గరిష్ఠ గడువు 6 నెలలు దాటిందని, అందువల్ల ప్రాథమికంగా ఇది ఉల్లంఘనేనని చెప్పారు.విచారణ అధికారి ఇచ్చిన నివేదికను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.