ఎస్ఎల్​బీసీ ప్రమాదంపై విచారణ అవసరం లేదు: హైకోర్టు

ఎస్ఎల్​బీసీ ప్రమాదంపై విచారణ అవసరం లేదు: హైకోర్టు
  • ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌బీసీ సొరంగం ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రమాదానికి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విచారణ ముగించింది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ జాతీయ వలస కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు పీవీకేకే భార్గవ్ పిల్‌‌ను దాఖలు చేశారు. సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. ఈ పిల్‌‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ శ్రీమతి రేణుకా యారా బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌‌ఎల్‌‌బీసీ శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను వెలికి తీయడంతో పాటు బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలి’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శర్​రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్​లో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

సహాయక చర్యల్లో సైన్యం, నేవీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌‌ఎఫ్‌‌, హైడ్రా బృందాలతో పాటు ఎల్‌‌ అండ్‌‌ టీ పాల్గొంటున్నాయి. కేబినెట్ మంత్రులతో పాటు సీఎం కూడా ప్రమాదం స్థలాన్ని సందర్శించారు. నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని చెప్పారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. సహాయక చర్యలన్నీ కొనసాగుతున్నప్పుడు ప్రత్యేకంగా న్యాయ విచారణ అవసరం లేదని పేర్కొంది. అయితే, ఏదైనా లోటుపాట్లు జరిగినప్పుడు పిటిషనర్‌‌ కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని ఇచ్చింది.