
- రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినా అందజేయని ఆత్మకూరు మండలం ఎమ్మార్వో వేతనాన్ని నిలిపివేయాలని హనుమకొండ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014లో భర్త ఆత్మహత్య చేసుకోవడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు స్పందించకపోవడంతో మృతుడి భార్య లక్కరుసు లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని విచారించిన హైకోర్టు.. అర్హతలను పరిశీలించి 4 నెలల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించినా అమలు చేయకపోవడంతో లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన లక్కరుసు మొగిలి పత్తిసాగు చేయగా, పంట దిగుబడి రాకపోవడంతో 2014 జులై 17న ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులన్నీ పరిశీలిస్తే కలెక్టర్ ఫిబ్రవరి 13న రూ.6 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసి బాధితురాలికి చెల్లించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అయితే తహసిల్దార్ ఉద్దేశపూర్వకంగా సొమ్ము చెల్లించకుండా బాధితురాలిని వేధింపులకు గురిచేయడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిహారం చెల్లింపులో అసాధారణ జాప్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తదుపరి ఉత్తర్వులు జారీచేసే దాకా ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్మును విత్‌డ్రా చేసి బాధితురాలికి చెల్లించని ఆత్మకూరు తహసీల్దార్ జీతంతో సహా ప్రోత్సాహకాలను నిలిపివేయాలని కలెక్టర్‌ను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు.