హైదరాబాద్: క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. 15 రోజుల పాటు ఊరట కల్పించాలన్న ఐఏఎస్ ల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. క్యాట్ ఆదేశాల ప్రకారం ముందుగా ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని, అభ్యంతరాలు, సమస్యలు ఏవైనా ఉంటే తర్వాత వింటామని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.
అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజా సేవ కోసమే పనిచేయాల్సిన IAS లు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. మీ వాదనలు వింటామని, కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తెలంగాణ- హైకోర్టు ఐఏఎస్లకు స్పష్టం చేసింది.
ALSO READ | ముందైతే ఏపీలో రిపోర్ట్ చేయండి.. ఐఏఎస్లకు తేల్చి చెప్పిన హైకోర్టు
తెలంగాణలో పనిచేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‌లను తిరిగి ఏపీకి వెళ్లాలని.. ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ వెళ్లాలని డీవోపీటీ ( Department of Personnel and Training ) (DoPT) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ అధికారిని సృజన డీవోపీటీ ఆదేశాలను క్యాట్‌లో సవాల్ చేశారు. సొంత కేడర్ స్టేట్లకు వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ.. తమను ప్రస్తుతం పని చేస్తోన్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్‌కు విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‌ల పిటిషన్లపై క్యాట్ అక్టోబర్ 15న విచారణ చేపట్టింది.
ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై డీవోపీటీకే పూర్తి అధికారులు ఉన్నాయని ఐఏఎస్ అధికారుల తరుఫు లాయర్లు వాదనలు వినిపించారు. డీవోపీటీ కూడా క్యాట్ ముందు తమ వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీవోపీటీ వాదనలతో ఏకీభవించింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం.. ఐఏఎస్ అధికారులు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది. అయితే క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్లకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఐఏఎస్లు ఏపీలో రిపోర్ట్ చేయడానికి ఇవాళే (అక్టోబర్ 16, 2024) డెడ్లైన్ కావడంతో సదరు ఐఏఎస్ అధికారులు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.