వైద్య సేవలకు ఆధార్ ఎందుకు?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్ట్

వైద్య సేవలకు ఆధార్ ఎందుకు?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్ట్
  • ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • వివరాలు సమర్పించాలని ఆదేశం
  • విచారణ ఈనెల 28కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలకు ఆధార్‌‌  కార్డు సమర్పించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. ఓ మహిళకు ఆధార్‌‌  కార్డు లేకపోయినా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు ఉన్న ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఆధార్‌‌ కార్డు లేనివారికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి  పిల్‌‌  దాఖలు చేశారు. 

దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌  సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌  రేణుక యారాతో కూడిన బెంచ్‌‌  సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌  తరపు న్యాయవాది ఆకాశ్‌‌  బాగ్లేకర్‌‌  వాదనలు వినిపిస్తూ భర్త చనిపోవడంతో ఆరేళ్ల కుమార్తెతో చిన్నచిన్న పనులు, యాచన చేసుకుంటున్న ప్రమీల అనే మహిళకు వైద్యం నిరాకరించడంతో రోడ్డుపై 10 రోజులుగా ఉన్నట్లు పత్రికలో కథనం వచ్చిందన్నారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తేల్చి చెప్పిందని, గుర్తింపు కార్డు లేకపోయినంత మాత్రాన వైద్యం నిరాకరించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. చికిత్సకు ఆధార్‌‌  కార్డు సమర్పించాలని ఏ చట్టంలోనూ నిబంధనలు లేవన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌‌ రెడ్డి ఈ వాదనతో విభేదిస్తూ ఆధార్‌‌  లేకపోయినా చికిత్స అందిస్తున్నారని చెప్పారు. పిటిషనర్‌‌  పేర్కొన్న మహిళకు వైద్యం అందిందా లేదా అన్నదానిపై వివరాలు సమర్పిస్తానని చెప్పడంతో ధర్మాసనం విచారణను 28కి వాయిదా వేసింది.