బండి సంజయ్కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా విధింపు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక చెల్లదంటూ బండి సంజయ్ గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ పై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. సెప్టెంబర్ 5వ తేదీ కూడా హైకోర్టులో విచారణ జరిగింది. 

అయితే.. విచారణ సందర్భంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ హాజరుకాకపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలాసార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు సంజయ్‌ తరఫు న్యాయవాది గడువు కోరగా..  ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున మరోసారి గడువు ఇవ్వాలని కోరారు. 

ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణ ముగిస్తామని హైకోర్టు హెచ్చరించింది. సెప్టెంబర్ 12వ తేదీన బండి సంజయ్‌ హైకోర్టులో హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థించారు. న్యాయవాది అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. బండి సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.