మాజీ సైనికుడి భూమిని డంపింగ్ యార్డ్​కు ఎట్లిస్తరు?

 

  • దేశ సేవ చేసినవారితో ఇలాగే ప్రవర్తిస్తారా
  • రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఫైర్​
  • స్టేటస్​కో కొనసాగించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  ఇండియన్ ఎయిర్ ఫోర్స్​లో పనిచేసి రిటైర్ అయిన సైనికుడి భూమిని డంపింగ్ యార్డ్ కు కేటాయించడం ఏంటని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. దేశానికి సేవలందించిన ఓ సైనికుడి కుటుంబంతో ఇలాగే ప్రవర్తిస్తారా? అని నిలదీసింది. ఇది ఏమాత్రం సరికాదని ఫైర్ అయింది. భూమి విషయంలో స్టేటస్​కో కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.

 హైదరాబాద్​కు చెందిన వీజీ విఠల్, ఇండియన్ ఎయిర్​ఫోర్స్​లో పని చేశారు. 1962లో చైనా, 1971లో పాకిస్తాన్​తో జరిగిన వార్​లో పాల్గొన్నారు. దేశ సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విఠల్​కు కేంద్ర ప్రభుత్వం ఏడు ప్రతిభా పురస్కారాలతో సన్మానించింది. విఠల్ సేవలకు గుర్తింపుగా 1974లో యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని సర్వే నెంబర్ 64/1లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 

2003లో విఠల్ చనిపోవడంతో ఆ భూమిని ఆయన భార్య వి.అరుణాబాయి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. భూమి ఆమె ఆధీనంలోనే ఉంది. 2022, డిసెంబర్​లో ఈ భూమిలో 2 ఎకరాలను డంపింగ్ యార్డ్​కు కేటాయిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.  దీన్ని అరుణాబాయి హైకోర్టులో సవాల్ చేశారు. విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్‌‌‌‌ బి.విజయసేన్‌‌‌‌రెడ్డి.. దేశానికి సేవలు అందించిన సైనికుడి విషయంలో ఇలా చేయడం తగదని మండిపడ్డారు. 

ALSO READ:బస్సులను,కార్లను నమ్ముకుంటే ఇల్లు చేరలేరు.. వచ్చేయండి సార్..!!

మాజీ సైనికుడి కుటుంబం విషయంలో ప్రభుత్వ తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. భూమి విషయంలో స్టేటస్​కో అమలు చేయాలని సూచించారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విచారణను ఆగస్టు 23కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.