వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది కోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటీషన్ పై.. ఏప్రిల్ 18వ తేదీ సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని సీబీఐని ఆదేశించింది హైకోర్టు. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. ఏప్రిల్ 25వ తేదీన కేసులో తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు
ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీత తరపు లాయర్ల మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి. గంటన్నరపాటు తమ తమ వాదనలు వినిపించారు. కేసు విచారణలోనే సీబీఐ చాలా అంశాలను విస్మరిస్తుందని.. కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని అవినాష్ తరపు లాయర్లు వాదించారు. దీంతో హైకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. వివేకానందరెడ్డిది గుండెపోటు అని ఎలా చెప్పారని ప్రశ్నించగా.. అలాంటి రూమర్స్ వచ్చాయని.. హత్య విషయం తెలిసిన తర్వాత వివేక ఇంటికి వెళ్లగా.. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారని.. ఎంపీ అవినాష్ రెడ్డి మొదటి వ్యక్తి కాదని హైకోర్టుకు వివరించారు అతని తరపు లాయర్.
ఇదే సమయంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు. వివేకానందరెడ్డి హత్య గురించి.. మొదట అవినాష్ కు చెప్పిందే.. ఆయన కుమార్తె భర్త సోదరుడు శివప్రకాష్ రెడ్డి అని.. అతన్ని సీబీఐ ఎందుకు విచారించటం లేదని ప్రశ్నించారు. కుటుంబ గొడవలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని..ఆ కోణంలో విచారించాలని పదేపదే కోరుతున్నా ఎందుకు విచారించటం లేదని అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ప్రస్తావించారు. ఈ సమయంలోనే.. ఈ కేసులో వివేకనందరెడ్డిని చంపిన ఆయుధం ఎక్కడ అని హైకోర్టు ప్రశ్నించటం కేసులో కీలక మలుపుగా మారనుంది.
సీబీఐ తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదించారు. వివేక హత్యలో కుటుంబ, వ్యాపార కోణం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దస్తగిరి, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ధించాయని.. ఏప్రిల్ 30వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయని.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాల్సింది ఉందని.. అవసరం అయితే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు సీబీఐ తరపు లాయర్.