ఏప్రిల్ 7 దాకా పనులొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏప్రిల్ 7 దాకా పనులొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • విదార్థులతోపాటు మరికొంత మంది కొత్త పిటిషన్లు దాఖలు
  • కౌంటరు దాఖలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని చెట్ల నరికివేత పనులను ఈ నెల 7వ తేదీ వరకు నిలిపివేయాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్‌‌లలో ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసిన తరువాత విచారణ చేపడతా మని పేర్కొంది. గచ్చిబౌలిలో సర్వే నం.25లో 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది జూన్‌‌ 26న జారీ చేసిన జీవో 54ను సవాలు చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన కె.బాబూరావు, వట ఫౌండేషన్‌‌లు పిల్‌‌లు దాఖలు చేయగా, గురువారం హైదరాబాద్‌‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులతోపాటు మరొకరు తాజాగా మరో రెండు లంచ్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌లు దాఖలు చేశారు.

వీటన్నింటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌‌ న్యాయవాది అభిషేక్‌‌ సింఘ్వీ, అడ్వొకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే ఈ హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నివేదిక కోరిందన్నారు. అంతేగాకుండా పనులు కొనసాగించరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.

గతంలో ఇదే హైకోర్టు 7వ తేదీ వరకు కౌంటరు దాఖలు చేయడానికి గడువు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ముందు వివాదం ఉన్న నేపథ్యంలో అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌ న్యాయవాది ఎస్‌‌.నిరంజన్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో తమకు అభ్యంతరంలేదని, అయితే అందులో తాము పార్టీలుగా లేనందున చెట్లను కొట్టివేయరాదన్న ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు.

అయితే చెట్లను కొట్టివేయరాదని ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గురువారం ఉదయం వరకూ చెట్ల నరికవేత కార్యక్రమం కొనసాగుతూనే ఉందన్నారు. నరికివేతపై ఫొటోలు తీస్తున్న విద్యార్థులను అరెస్ట్‌‌ చేసినట్లు తెలిసిందన్నారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా మధ్యంతర పిటిషన్‌‌ దాఖలు చేశామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ దీనిపైనా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌ జి.ప్రవీణ్‌‌కుమార్‌‌ వాదనలు వినిపిస్తూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందనగా ధర్మాసనం వాటిని సమర్పించాలని ఆదేశించింది. విద్యార్థుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసుల దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇది వర్సిటీ స్థలమని, దాన్ని రక్షించుకోవాలన్నదే తమ ప్రయ త్నమన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విచారణను 7వ తేదీకి వాయిదా వేస్తూ.. అన్ని పిటిషన్‌‌లోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.