హైదరాబాద్, వెలుగు: తల్లి హత్య కేసులో కొడుకును నిర్దోషిగా తేలుస్తూ ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టు సవరించింది. కన్న తల్లిని హత్య చేశాడనే ఆరోపణతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల పోచయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి 2015లో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో అతడు జైల్లోనే ఉంటూ ఆ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. అప్పీల్ విచారణలో ఉండగానే పోచయ్య జైలులో 2018లో మరణించాడు. అయితే, ఈ కేసులో ఇటీవల పోచయ్యని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
పోచయ్య మరణించిన విషయం తెలియక..అతడిని రిలీజ్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత పోచయ్య చనిపోయిన విషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. పోచయ్య చనిపోయినట్లు నిర్ధారించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయాన్ని జస్టిస్ కె సురేందర్, జస్టిస్ జె శ్రీనివాసరావుల ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సమాచార లోపం వల్ల పోచయ్య చనిపోయిన విషయం తెలియలేదని కోర్టుకు తెలిపారు.