
- పోలీసులకు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారంటూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారు, కాంగ్రెస్ నేత బి.శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.2500 కోట్లను ఢిల్లీకి పంపారంటూ గతేడాది మార్చి 27న కేటీఆర్ చేసిన ఆరోపణలపై బి.శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు వేశారు.
దాన్ని కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్.. ప్రతివాదులైన పోలీసులకు, ఫిర్యాదుదారు శ్రీనివాసరావుకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేశారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులోనూ..
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ఎం.గోపాల్ వేసిన పిటిషన్‌లను కూడా జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. పోలీసులతోపాటు ఫిర్యాదుదారు ఆర్.ప్రేమ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేశారు. 2023 నవంబరు 27న ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణసంచా కాల్చడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ అప్పటి ముషీరాబాద్ ఎస్సై ఆర్.ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దీన్ని కొట్టివేయాలంటూ కేటీఆర్, ఎం.గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు.