- హైకోర్టు ప్రశ్నించినా జవాబు చెప్పని జీహెచ్ఎంసీ
- మూడేండ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
- టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపైనే అనుమానాలు
సిటీలో అక్రమకట్టడాలు ఎన్ని ..? పర్మిషన్‌కు మించి ఎక్కువ అంతస్తులు కట్టిన భవనాలు ఎన్ని..? భద్రత, నిర్మాణ పటిష్టతకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించినవి ఎన్ని..? ఈ వివరాలు సిద్ధం చేయడంలో జీహెచ్‌ఎంసీ విఫలమవుతుంది. సిటీలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించి మూడేళ్ల క్రితమే లక్షా ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువ అంతస్తులు, ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించిన భవనాలు, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించినవే ఉన్నాయి.
మూడేండ్ల కిందట హైకోర్టు ఆదేశించినా..
మూడేళ్ల కిందట సిటీ లో అక్రమ కట్టడాల వివరాలు తెలపాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. కానీ వివరాలను సమర్పించడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. సిబ్బంది కొరత ఉందని దాటవేస్తుంది. ఇటీవల జీహెచ్ఎంసీలో నియామకమైన ఇంజనీర్లను టౌన్ ప్లానింగ్ కు కేటాయించారు. క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ కట్టడాలను గుర్తించాల్సి ఉంటుంది. బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీపీఎస్ కింద దాఖలైన లక్షా ఇరవై వేల దరఖాస్తులను పరిశీలించి వివరాలు సమర్పించాలని తెలిపింది. బీపీఎస్ కు అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించినట్టయితే వాటిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ సిబ్బంది కొరత అంటూ బల్దియా కాలయాపన చేస్తూ వస్తుంది. ఈ ఏడాది మార్చిలో క్షేత్రస్థాయిలో బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న భవనాల తనిఖీ కోసం సిబ్బందిని కేటాయించింది. కానీ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. ఇప్పటికీ కేవలం 5,000 బిల్డింగ్ ల తనిఖీ పూర్తయినట్లు తెలుస్తుంది.
గత నవంబర్‌లోనే ఫోకస్
జీహెచ్‌ఎంసీ అక్రమ కట్టడాలపై గతేడాది నవంబర్ లోనే ఫోకస్ చేసింది. జాబితా సిద్ధం చేసి కూల్చివేతకు కూడా వెనుకాడమని తేల్చిచెప్పింది. ఈ మేరకు అక్రమ కట్టడాలు, నిబంధనలు ఉల్లంఘించిన భవనాల వివరాల జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సర్కిళ్ల వారీగా నోటీసులు అందుకున్న భవనాలు, అందులో అక్రమ నిర్మాణాలుగా తేలినవి, అనుమతులకు మించి అదనపు నిర్మాణం, వివాదాల్లో చిక్కుకున్న కట్టడాల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి సమాచారాన్ని ప్రతిరోజూ అప్‌డేట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఆ దిశగా కసరత్తు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కూడా ఆదేశించారు. సమగ్ర వివరాల జాబితాను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు అందచేయాలని సూచించారు. తొలి విడతలో 30 సర్కిళ్లలో సర్కిల్‌కు మూడు 3 చొప్పున 90 కట్టడాలను ఎంపిక చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పుకొచ్చారు.
నోటీసులు అందుకున్న భవనాల వివరాలు సర్కిల్ కార్యాలయాలు, హెడ్డాఫీసులో అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయి. కానీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అక్రమ కట్టడాల వివరాలను క్రోడీకరించి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందచేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నీళ్లు నములుతూ కూర్చున్నారు. చాలా అక్రమ కట్టడాల వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చేతులు తడపడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటే తమ బండారం కూడా బయట పడుతుందని కొందరు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. లేకపోతే వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ లేకనే..
ఏదైనా భవన నిర్మాణానికి అనుమతి జారీ చేసిన నాటి నుంచి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలి. తనిఖీలు నిర్వహించి, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలి. అక్రమ నిర్మాణాలు జరిగితే వెంటనే వాటిని నివారించాలి. ఇందుకోసం కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ పర్యవేక్షణ కొరవడటం వల్ల అక్రమ కట్టడాలు భారీగా వెలుస్తున్నాయి. ఏళ్ల తరబడిగా టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరుపై ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. సిటీలో సుమారు లక్షా 20 వేల వరకు అక్రమ కట్టడాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది 2018 మార్చి 3 నాటికి క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే. పూర్తిగా అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలు, అనుమతులకు పరిధిని దాటి నిర్మాణాలు చేపట్టిన కట్టడాల వివరాలివి. అనంతరం కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు.