సార్.. మా పార్క్ కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

సార్.. మా పార్క్  కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ
  •     వచ్చే నెల 7 లోపు కౌంటర్  వేయాలని అధికారులకు ఆదేశం
  •     `ప్రతివాదుల్లో  సీఎస్, పురపాలక ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌‌లోని బడుగు వర్గాల కోసం కేటాయించిన హౌసింగ్‌‌  బోర్డు కాలనీలోని పిల్లల పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడంపై 23 మంది పిల్లలు రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది. చీఫ్‌‌  జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌  అనిల్‌‌  కుమార్ తో కూడిన డివిజన్‌‌  బెంచ్‌‌  మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌‌ కమిషనర్, ఆదిలాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌‌కు బెంచ్  నోటీసులు జారీ చేసింది. కబ్జాదారులకు మున్సిపల్‌‌  కమిషనర్‌‌  శైలజ సలహాలిస్తున్నారని పిల్లలు ఆ లేఖలో పేర్కొన్నందున ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.

ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్‌‌  వేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, 1970లో ఆదిలాబాద్‌‌లో బడుగు వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటైన హౌసింగ్‌‌ బోర్డు కాలనీలో 15 ఎకరాలను పిల్లల పార్క్‌‌  కోసం కేటాయించారు. ఆ భూమిలో 30 గుంటల స్థలాన్ని  2000–2004 కాలంలో కొందరు ఆక్రమించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయాయి. పార్కు భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను నివారించాలని కోరుతూ కాలనీ పెద్దలతోపాటు పిల్లలు కూడా ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 23 మంది పిల్లలు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌‌గా పరిగణించి విచారణ ప్రారంభించింది.