జడ్జీల ఫోన్ ట్యాపింగ్​పై హైకోర్టు ఎంక్వైరీ

జడ్జీల ఫోన్ ట్యాపింగ్​పై హైకోర్టు ఎంక్వైరీ
  • పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం
  • నేడు సీజే అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ విచారణ

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ రాజకీయ ప్రత్యర్థులతో పాటు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నది. మంగళవారం ఈ పిటిషన్​పై​విచారణ చేపట్టనుంది. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్‌‌ను విమర్శించిన ప్రతి నేతతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బీఆర్ఎస్ హయాంలో ఎస్‌‌ఐబీలో పనిచేసిన ఏఎస్పీ భుజంగరావు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. 

అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సూచనలతో మేకల తిరుపతన్న, ప్రణీత్​రావు, టాస్క్​ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కథనాలు ప్రింట్ అయ్యాయి. టెర్రరిస్టుల లొకేషన్లు గుర్తించేందుకు వాడే పరికరాల సాయంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జడ్జిల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకున్నట్టు భుజంగరావు ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. వీరితో పాటు స్టూడెంట్ యూనియన్ నేతలు, అపోజిషన్ పార్టీ లీడర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులపై నిఘా పెట్టినట్టు అంగీకరించారు. దుబ్బాక, హుజూర్​నగర్, మునుగోడు ఉప ఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎలక్షన్ల టైమ్​లో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు భుజంగరావు పేర్కొన్నారు. 

బీఆర్ఎస్​ను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీమ్​గా కృషి చేసినట్టు ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ల ఆదేశాలతో ప్రముఖ కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన సివిల్ వివాదాలు సెటిల్ చేసినట్టు కథనాలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఫ్రెండ్ గాలి అనిల్ కుమార్ నుంచి రూ.90లక్షలు, పొంగులేటి ఫ్రెండ్ వినయ్ రెడ్డి నుంచి రూ.10.50కోట్లు, జి.వినోద్ నుంచి రూ.50లక్షలు.. ఇలా పలువురి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్టు భుజంగ రావు అంగీకరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతోనే దాడులు చేసినట్టు తిరుపతన్న కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వీటన్నింటిని సుమోటో పిటిషన్​గా స్వీకరించి విచారించేందుకు హైకోర్టు సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్​తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనున్నది.