పిల్లలు చనిపోతేనే స్పందిస్తారా..? మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్

పిల్లలు చనిపోతేనే స్పందిస్తారా..? మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: నారాయణపేట జిల్లాలోని మాగనూర్ ప్రభుత్వ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. వారం రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నట్టని.. పిల్లలు చనిపోతేనే అధికారులు స్పందిస్తారా అని హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూర్ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

 ఈ పిటిషన్‎పై 2024, నవంబర్ 27వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకి తెలియజేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు. 

Also Read :- మై హోం భూజ 9వ అంతస్తు నుంచి పడి మృతి

హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని ప్రశ్నించిన సీజే.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో వివరాలతో హాజరవుతారని వ్యాఖ్యానించారు. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా.. వాళ్లు కొంచెం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. దీంతో మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను హై కోర్టు మధ్యాహ్ననికి వాయిదా వేసింది.