కోతుల కంట్రోల్​కు ఏం చేస్తున్నరు: తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

కోతుల కంట్రోల్​కు ఏం చేస్తున్నరు: తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు
  • కోతుల సమస్యపై రైతు సమస్యల సాధన సమితి లేఖ
  • ఆ లేఖను పిల్​గా స్వీకరించి విచారించిన బెంచ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోతుల బెడద తప్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోతుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోందని, ఇండ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నాయని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ఎం. మల్లన్న హైకోర్టుకు లేఖ రాశారు. రాష్ట్రంలో 3 కోట్ల కోతున్నాయని, ప్రతీ గ్రామంలో వాటితో సమస్య ఉందని పేర్కొన్నారు. 

ఇండ్లు, తోటలు, పంట పొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్ర మానసిక, ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని లేఖలో కోరారు. ఈ లేఖను పిల్​గా  స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి శ్రీమతి రేణుకా యారా బెంచ్ సోమవారం విచారించింది. 

ప్రభుత్వం తరఫున జీపీ పూర్ణచందర్‌‌‌‌రావు వాదనలు వినిపించారు. గతంలో ఇదే అంశంపై పిల్‌‌‌‌ దాఖలైందని, అది ఇంకా విచారణ దశలోనే ఉందని గుర్తుచేశారు. ఆ పిల్‌‌‌‌లో పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేశామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. గత పిల్‌‌‌‌తో ఈ సుమోటో పిల్‌‌‌‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణ నాలుగువారాలకు వాయిదా వేసింది.