హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం (సెప్టెంబర్ 30) వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది.
ALSO READ | బీజేపీ, BRS కుట్రలో భాగంగానే పొంగులేటిపై ఈడీ రైడ్స్: మహేష్ గౌడ్
అయితే, హైడ్రా నేలమట్టం చేసిన ఈ భవనంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కోర్టులో విచారణ జరుగుతోన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైడ్రాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విచారణ ఉన్న భవనాన్ని కూల్చివేడయంపై వచ్చే సోమవారం (సెప్టెంబర్ 30) వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరు అయ్యి సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా, అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోన్న వేళ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.