విచారణకు రావాల్సిందే: BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడికి హై కోర్టు ఆదేశం

విచారణకు రావాల్సిందే: BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడికి హై కోర్టు ఆదేశం

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‎కు తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హై కోర్టు ఆదేశించింది. ఈ నెల (డిసెంబర్) 16న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‎లోని ప్రజాభవన్‌ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ప్రమాదంలో కారు డ్రైవర్‌ను మార్చి రాహిల్ పరారైనట్లు పోలీసులు ఆరోపించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడంతో రాహిల్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్‎లో ఉన్న రాహిల్.. ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‎పై బుధవారం (డిసెంబర్ 4) విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసు విచారణకు సహకరించాలని రాహిల్‌ను ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాహిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతాడా లేదా అన్నది చూడాలి.