
- డిచ్పల్లి సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు నమోదుకు హైకోర్టు ఆర్డర్
- మహిళను కొట్టిన ఘటనలో బోధన్ రూరల్ సీఐపై కలెక్టర్‌కు ఫిర్యాదు
- ఇప్పటికే అతడిపై లాకప్ డెత్ ఆరోపణలు
- కొత్త పోలీస్ బాస్ ముందు వివాదాల సవాళ్లు
నిజామాబాద్, వెలుగు : జిల్లా పోలీసులకు వివాదాల ఉచ్చు బిగుస్తున్నది. అండగా ఉండాల్సిన రక్షకులు బాధితులను వేధిస్తున్నారు. మహిళలపై లాఠీ ఝళిపించడం, కస్టడీ మరణాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదును ఖాతరు చేయకపోవడంతో వారం కింద హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కలకలం రేపుతుంది.
దళితుడి ఫిర్యాదు డోంట్ కేర్..
రూరల్ సెగ్మెంట్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి విలేజ్‌లో ఓ దళితుడు రాగుట్ల నచ్చన్నకు సర్వే నంబర్ 197/ఆ లో ఎకరం భూమి ఉంది. ఆ భూమిని టెంపుల్ కోసం వినియోగించడానికి గత నవంబర్‌లో కొందరు గ్రామస్తులు ప్రయత్నించగా జక్రాన్‌పల్లి స్టేషన్లో ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశాడు. ఎస్సై పట్టించుకోవడంలేదని డిచ్పల్లి సీఐ మల్లేశ్దృష్టికి తీసుకెళ్లాడు.
పంట వేయడానికి కుటుంబీకులతో నచ్చన్న వెళ్లగా కానిస్టేబుల్ మహేందర్ వచ్చి వారందరినీ దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని బాధితుడు నచ్చన్న జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించగా డిచ్పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిసెంబర్ 2న అప్పటి ఇన్చార్జి సీపీ సింధూశర్మను అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాస్ రెంఆదేశించారు. నెలలు దాటినా కేసు నమోదు కాకపోవడంతో ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా కలెక్టర్ రాజీవ్‌గాంధీతో పాటు తహసీల్దార్ నుంచి రిపోర్టు తెప్పించుకుంది.
జిల్లా జడ్జి శ్రీనివాస్ తీర్పు అమలును కోరుతూ ఫిబ్రవరి 27న బాధితుడు నచ్చన్న హైకోర్టులో పిటీషన్ వేయగా, జస్టిస్ విజయసేన్‌రెడ్డి గత వారం ఆర్డర్స్ జారీ చేశారు. సీఐ మల్లేశ్, ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ మహేందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భూ వివాదంలో వచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు రిజిస్ట్రర్ చేయలేదో దర్యాప్తు చేయాలని స్టేట్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా సీపీని ఆదేశించారు.
బోధన్ రూరల్ సీఐ దూకుడు..
నిజామాబాద్ వన్ టౌన్లో వివాదాలు ఎదుర్కొని నాలుగు నెలల క్రితం బోధన్ రూరల్ సీఐగా ట్రాన్స్ఫర్ అయినా విజయబాబు తీరు మారలేదు. రెంజల్ మండలం దూపల్లి విలేజ్‌కు చెందిన బోయి భాగ్యను జాన్కంపేట లక్ష్మీనర్సింహాస్వామి టెంపుల్ వద్ద ఫిబ్రవరి 13న వాతలు తేలేలా లాఠీతో కొట్టారు. ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరై పర్సు పొగొట్టుకున్న విషయాన్ని తెలుపగా అసహనంతో చిందులేసి లాఠీ ఝుళిపించారు. సీఐ విజయ్‌బాబుపై యాక్షన్ డిమాండ్ చేస్తూ ఆమె గత వారం కలెక్టర్‌ను కలిశారు. మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో డిసెంబర్ 13న రెడ్యానాయక్ అనుమానాస్పద మృతి ఘటన వాస్తవాలు బయటకు రాకుండా సీఐ కీరోల్ పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. తండాలో కూడా ఇద్దరు గిరిజన మహిళలపై అతడు చేయిచేసుకున్నాడని బాధితులు చెబుతున్నారు. సీఐ వేధింపులతో సర్కిల్ పరిధిలో ఇద్దరు ఎస్సైలు తరచూ లీవ్‌లో వెళ్లి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు కస్టడీ డెత్..
గత అక్టోబర్ నుంచి జిల్లాలో పూర్తి స్థాయి సీపీ లేకపోడంతో ఆఫీసర్లపై నిరంతర అజమాయిషీ లోపం స్పష్టంగా కనబడింది. ఈనెల 11న కొత్త సీపీగా సాయిచైతన్య బాధ్యతలు తీసుకొని జిల్లాలో పరిస్థితులను స్టడీ చేస్తున్నారు. ఇంతలో పోలీస్ కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు 13న రాత్రి మరణించడం కలకలం రేపింది. ఇందల్వాయి ఎస్సై మనోజ్‌కుమార్ ఇసుక బిజినెస్‌పై ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి ఇప్పటికే ఫిర్యాదు వెళ్లింది.
కోటగిరి, రెంజల్, ఎడపల్లి, నవీపేట, రుద్రూర్ ఎస్సైలకు ఇసుక దందాతో సంబంధమున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు వెళ్లాయి. ప్రత్యర్థుల దాడికి బాధితుడిని చేసిన ఘటనలో బాల్కొండ సీఐగా పని చేసిన నవీన్, ఎస్సై మల్లేశ్, స్టూడెంట్ ఇష్యులో టౌన్ సీఐ సతీష్, ఎస్సై గంగాధర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. అక్రమ కేసుల బనాయింపులో 2 టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్, ఏఎస్సై లక్ష్మణ్‌నాయక్ ఎస్బీ కానిస్టేబుల్ పై లోకాయుక్తకు కంప్లైంట్ వెళ్లింది.