కనీస వేతనాలపై..మా ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు?

కనీస వేతనాలపై..మా ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు?
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్‌‌ పబ్లిష్ చేయాలని గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో కౌంటర్‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఐదేండ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్‌‌ విడుదల చేయాల్సి ఉండగా.. 2007 నుంచి ఇప్పటివరకు గెజిట్ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్‌‌ ట్రేడ్‌‌ యూనియన్‌‌ కౌన్సిల్‌‌ 2023లో పిల్‌‌ దాఖలు చేసింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయని పిటిషన్‌‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌ వాదించారు. కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం.. వెంటనే గెజిట్‌‌ ప్రింట్‌‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్‌‌ అండ్‌‌ స్టేషనరీ కమిషనర్‌‌ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీ చేసింది.