
- ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా చేపట్టాలి
హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగానే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్లలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు రెండు భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది.
ఈ మేరకు జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మినారాయణ అలిశెట్టితో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. గురుకుల విద్యా సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి 2023లో వెలువరించిన నోటిఫికేషన్ మేరకు ఆ ఏడాది ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్లో ఉంటుందని నోటిఫికేషన్‌లో ఉందని, అయితే కేవలం ఇంగ్లిష్లో మాత్రమే పరీక్ష నిర్వహించారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్ జడ్జి.. క్రాఫ్ట్ టీచర్ పోస్టుల నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఆర్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ గురుకుల నియామక బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను డివిజన్ బెంచ్విచారించింది. పరీక్షను తిరిగి నిర్వహిస్తే దాని ప్రభావం ఇప్పటికే పరీక్ష రాసిన 4,359 మందిపై పడుతుందని, నియామకాలు ఆలస్యం అవుతాయని, అప్పీళ్లను కొట్టేయాలని గురుకుల నియామక బోర్డు చేసిన వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆర్డ్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తెలుగు, ఇంగ్లిష్భాషల్లో పరీక్షలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది.