- వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్లు కల్పించాలి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- పీజీ మెడికల్ స్థానికత జీవోలు 148, 149 రద్దు
- రాష్ట్రంలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారిని స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్/బీఏఎంఎస్ చేసిన వారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీలో అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించింది. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్లకు సంబంధించి స్థానికత నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. పీజీ మెడికల్ నిబంధనలు–2021ని సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 148, 149ని కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది.
రాష్ట్రం వెలుపల చదివిన, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కల్పించాలని సూచించింది. నిబంధనలు తీసుకురావడంతో పాటు సవరణ తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ సవరణలు చట్టానికి అనుగుణంగా ఉండాలని పేర్కొంది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని గుర్తుచేసింది. స్థానిక కోటాకు పీజీ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్లకు సంబంధించి 2021 పీజీ మెడికల్ అడ్మిషన్ల నిబంధన 8కి సవరణ తెస్తూ అక్టోబరు 28న వెలువడిన జీవో 148, 149ని సవాలు చేస్తూ దాఖలైన 98 పిటిషన్లపై బెంచ్ తీర్పు చెప్పింది.
పిటిషనర్లు అందరూ ఏపీ, రాజస్థాన్లలో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారే. చైనా ఇతర చోట్ల ఎంబీబీఎస్ చేసి తెలంగాణలో సివిల్ సర్జన్లుగా చేస్తున్న వాళ్లనూ స్థానిక కోటా కింద తిరస్కరించడాన్ని సవాల్ చేసిన పిటిషన్లపై హైకోర్టు 106 పేజీల తీర్పు వెలువరించింది.
జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం
ఎంబీబీఎస్‌లో కూడా స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాన్ లోకల్ కేటగిరిలో ఎంబీబీఎస్ లో చేరినవారు స్థానిక కోటా కింద పీజీలకు అర్హులు కాదు. పీజీ అడ్మిషన్లలో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్లకే ఎంబీబీఎస్ స్థానిక కోటా కింద అడ్మిషన్లు లభిస్తాయని, ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద సీటు పొందినవారే పీజీ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద అర్హులన్న వాదన చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు స్థానికంగా చదువుకున్నట్లయితే స్థానిక అభ్యర్థిగా పరిగణించాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జీవోలు 148, 149 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. ‘‘పీజీ మెడికల్ కోర్సులకు ఆగస్టు 11న పరీక్ష జరిగాయి. అదే నెల 23న ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబరు 28న మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా రూల్స్‌ను ప్రభుత్వం మారుస్తూ జీవోలు జారీ చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత రూల్స్ మార్చడానికి వీల్లేదు. నోటిఫికేషన్ జారీ అయ్యాక రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి జీవో 148, 149 చెల్లవు” అని హైకోర్టు తేల్చి చెప్పింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయి
తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవరించడం గానీ, రద్దు చేయడంగానీ చేయలేదని తెలిపింది. దీంతో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు ఉంటాయని తెలిపింది. ఆ ఉత్తర్వులను ప్రభుత్వం అమల్లో ఉన్నట్లుగా అన్వయించుకున్నట్లేనని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న ప్రభుత్వ వాదన చెల్లదని వెల్లడించింది.