ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్

 

  • జీవో 33ని కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకే నష్టమన్న హైకోర్టు
  • ఇక్కడే పుట్టి, పెరిగిన విద్యార్థులను గుర్తించేందుకు గైడ్‌‌లైన్స్ రూపొందిం చాలని ప్రభుత్వానికి సూచన
  • వేరే స్టేట్‌‌లో ఎగ్జామ్​ రాసినా స్థానికత అమలు చేయాలని ఆదేశం
  • వాటి ప్రకారం అర్హులైన పిటిషనర్లను స్థానికులుగా గుర్తించాలి

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 నిబంధనలు సరిగ్గానే ఉన్నాయని, ఆ జీవోను కొట్టేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఆ జీవోను రద్దు చేస్తే, తెలంగాణ స్టూడెంట్లకే అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే, ఈ జీవోతో పాటు తెలంగాణ శాశ్వత నివాసులను(పర్మినెంట్ రెసిడెంట్స్‌‌‌‌) గుర్తించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎంబీబీఎస్, డెంటల్ సీట్ల భర్తీ కోసం ఇటీవలే ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చింది.

ఈ జీవో ప్రకారం ఎంబీబీఎస్‌‌‌‌ అడ్మిషన్లలో లోకల్ కేటగిరీ సీట్లు పొందాలంటే, ఆ విద్యార్థి కచ్చితంగా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ వరసగా 4  సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి. కొంత మంది స్టూడెంట్స్‌‌‌‌ ఈ జీవోను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తాము తెలంగాణ వాసులమేనని, వివిధ కారణాల వల్ల ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నామని కోర్టుకు తెలిపారు. తమను స్థానికులుగా గుర్తించకపోతే నష్టపోతామని, అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి, తమను స్థానికులుగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు, గురువారం తీర్పు వెలువరించింది.

పిటిషనర్లు కోరినట్టుగా జీవోను రద్దు చేయలేమని, ఒకవేళ రద్దు చేస్తే తెలంగాణ విద్యార్థులకే అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. అదే సమయంలో, పిటిషనర్ల ఆవేదనను కూడా తాము పరిగణలోకి తీసుకుంటున్నామని కోర్టు తెలిపారు. పిటిషనర్ల స్థానికతను నిర్దారించుకున్నాక, అడ్మిషన్ల కోసం వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే, జీవో 33లోని నిబంధనను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో పుట్టి, పెరిగిన విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ శాశ్వత నివాసితులను(పర్మినెంట్ రెసిడెంట్స్‌‌‌‌) గుర్తించేందుకు మార్గదర్శకాలు ఏవైనా ఉన్నాయా అని ప్రభుత్వ తరఫు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. అలాంటి, నిబంధనలు ఏవీ లేవని లాయర్ తెలపడంతో, శాశ్వత నివాసితులను గుర్తించేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది. ఆ నిబంధనల రూపకల్పనలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన పిటిషనర్లను స్థానికులుగా గుర్తించాలని కాళోజి హెల్త్ యూనివర్సిటీని కోర్టు ఆదేశించింది.

స్థానికత రాదని చెప్పేందుకు వీల్లేదు

వైద్య విద్య ఎంబీబీఎస్, బీడీఎస్‌‌‌‌ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద పూర్తిగా అర్హులు. తెలంగాణ స్టూడెంట్ ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత కిందకు రాదని చెప్పడానికి వీల్లేదు. ఈ విధంగా స్థానికతను నిరాకరించడం చెల్లదు. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు వైద్య విద్యను పొందాక రాష్ట్రంలోనే ఉంటారు కనుకు వాళ్లను రాష్ట్ర నివాసితులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నిబంధనను చేర్చింది ఈ లక్ష్యాలను సమర్ధించాలి.

తెలంగాణకు చెందిన విద్యార్థులకు నష్టం చేకూరేలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితుడనే వ్యవహారంపై ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించలేదు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థి వివరాలను పరిశీలించి స్థానిక కోటా అమలుపై కాళోజీ వర్సిటీ నిర్ణయం తీసుకోవాలి. ఎంబీబీఎస్, బీడీఎస్‌‌‌‌ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ డెంటల్‌‌‌‌ కాలేజీస్‌‌‌‌ అడ్మిషన్‌‌‌‌ నిబంధనలు 2017లోని రూల్‌‌‌‌ 3(ఏ) చట్టబద్ధమే.

ఈ మేరకు జులై 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 చట్టబద్ధమే. తెలంగాణకు చెందిన విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా వర్తింపజే సేందుకే ఆ నిబంధనను ప్రభుత్వం తెచ్చింది. ఇది స్థానిక విద్యార్థుల హక్కును రక్షిస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు కాళోజీ వర్సిటీ తెలంగాణ స్థానికత వ్యవహారంపై సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలి.. అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.