బీసీ రిజర్వేషన్లపై 3 నెలల్లో స్టడీ నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

బీసీ రిజర్వేషన్లపై 3 నెలల్లో స్టడీ నివేదిక ఇవ్వాలి: హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌‌ల పై మూడు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వికాస్‌‌ కిషన్​రావు గవాలి వర్సెస్‌‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సూచించిన విధానంపై అధ్యయనం నిర్వహించి అమలు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌‌లకు సంబంధించి జీహెచ్‌‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌‌ 5ను సవాలు చేస్తూ జాజుల శ్రీనివాస్‌‌గౌడ్, దాసోజు శ్రవణ్‌‌కుమార్‌‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్​ మంగళవారం విచారణ చేపట్టింది. 

అడ్వొకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌‌ల కల్పనకు కేవలం రాజకీయ వెనుకబాటుతనాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ఆర్థిక, సామాజిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకోరాదన్నారు. వికాస్‌‌ కిషన్​రావు గవాలి వర్సెస్‌‌ మహారాష్ట్ర కేసులో వెలువరించిన తీర్పు 13వ పేరాలో అధ్యయనం నిర్వహించాలని పేర్కొందని, అది పూర్తయ్యాక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మూడు నెలల సమయం పడుతుందన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బెంచ్​ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి అమలు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.