- మిగిలినవి మృతుల బంధువులకు అప్పగించండి
- ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాల్లో పిటిషనర్ ఐలమ్మ భర్త డెడ్‌బాడీని భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మిగిలిన డెడ్‌బాడీలను వాళ్ల బంధువులకు అప్పగించాలని తెలిపింది. తదుపరి విచారణ వరకు ఐలమ్మ భర్త మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచాలని ఆదేశించింది. ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు, తీసుకున్న చర్యలపై ఏఏ నిబంధనలు అమలు చేశారో సమర్పించాలని పోలీసులకు సూచించింది.
తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, తన భర్తను పోలీసులు కాల్చి చంపారని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ మల్లయ్య భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి మంగళవారం పిటిషన్‌పై మరోసారి విచారణ జరిపారు. పోస్టుమార్టం పూర్తయిందని, నివేదిక అందాల్సి ఉందని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ మహేశ్ రాజే చెప్పారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ స్పందిస్తూ.. ‘‘పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు. బంధువుల సమక్షంలో ఇంక్వెస్ట్ చేయాలి. ఇంక్వెస్ట్కు పిటిషనర్ వస్తున్నట్లు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. డెడ్‌బాడీలను ఎందుకు హడావుడిగా తరలించారు? కోర్టులో విచారణ జరుగుతుండగానే హడావుడిగా పోస్టుమార్టం ఎందుకు చేయాల్సి వచ్చింది?’’అని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు.