హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు తొలిసారి తెలుగులో తీర్పు వెల్లడించింది. భూ వివాదానికి సంబంధించిన కేసులో జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ భీమపాక నగేశ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును ప్రకటించింది. ఈ నెల 27న తెలుగులో 45 పేజీల తీర్పును బెంచ్ వెలువరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 41పేజీల ఇంగ్లిష్ కాపీని కూడా అందజేసింది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని సర్వే 162, 163లో 13.01 గుంటల భూమి చంద్రారెడ్డి తండ్రి కౌకుంట్ల వీరారెడ్డి పేరుపై ఉంది. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు పంచుకోగా 4.08 ఎకరాల భూమి చంద్రారెడ్డి భార్య సాలమ్మ పేరుపై ఉంది.
సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరిసగం పంచుకున్నారు. 2005 మార్చి 28న సారమ్మ చనిపోవడంతో ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యూటేషన్ చేయాలని చంద్రారెడ్డి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సారమ్మ రాసిన వీలునామాపై కె.ముత్యంరెడ్డి ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత వారసత్వ చట్టం 1925కు అనుగుణంగా వీలునామా లేదని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులు అందరికీ సమంగా పంచాలన్న వాదనను కింది కోర్టు ఆమోదించింది. దీనిని రద్దు చేయాలని చంద్రారెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను డివిజన్ బెంచ్ కొట్టేస్తూ తెలుగులో జడ్జిమెంట్ చెప్పింది. అప్పీల్‌ను డిస్మిస్ చేసి కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.