మేడిగడ్డ సందర్శనకు అనుమతి అవసరమా: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

మేడిగడ్డ సందర్శనకు అనుమతి అవసరమా: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • నిషేధిత ప్రాంతమని తెలిపే కేంద్ర నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పించండి

హైదరాబాద్,వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి అనుమతులు అవసరమా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం  ప్రశ్నించింది. ఒకవేళ అనుమతులు అవసరమనుకుంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని స్పష్టం చేసింది.  ఒక ప్రాంతాన్ని నిషేధిత జాబితాగా ప్రకటించాలంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయాల్సి ఉందని, మేడిగడ్డకు సంబంధించి అలా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్పించాలని ఆదేశించింది. 

దీంతోపాటు ఈ కేసులో నమోదు చేసిన 8 మంది సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని కోరుతూ విచారణను 18కి వాయిదా వేసింది. మేడిగడ్డ సందర్శన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగించారంటూ గతేడాది జులై 29న మహదేవపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్కసుమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారించారు. 

ఇరు పక్షాల వాదనలు ఇలా..

పిటిషనర్ల తరఫున అడ్వకేట్ టి.వి.రమణరావు వాదిస్తూ..కేసు నమోదు చేయడంలో జరిగిన జాప్యానికి కారణం వెల్లడించలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి సందర్శించారంటూ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీరు వలీషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు చేశారన్నారు. గతేడాది జులై 26న సందర్శించారని, ఫిర్యాదుదారుకు అభ్యంతరం ఉంటే అదే రోజు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన తరువాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కేసు నమోదు చేసినట్లు కోర్టుకు వివరించారు. 

నిషేధిత జాబితా ప్రాంతమైతే కేంద్రం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయాల్సి ఉందన్నారు. మేడిగడ్డ రిజర్వాయరును కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు సందర్శించిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ..మేడిగడ్డ జాతీయ భద్రతా అంశాల పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసిందన్నారు. 8 మంది సాక్షుల వాంగ్మూలాలున్నాయని తెలిపారు. 

అక్కడ ఉన్న సిబ్బందిని నెట్టుకుంటూ, వారి విధులకు భంగం కలిగిస్తూ మేడిగడ్డను సందర్శించారన్నారు. అంతేగాకుండా అధికారిక రహస్యాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చిత్రీకరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీతోపాటు సాక్షుల వాంగ్మూలాలను పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాదికి, కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.