- చట్టప్రకారమే చర్యలు ఉండాలి
- మర్రి, మారుతి, గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై విచారణ
- ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి
హైదరాబాద్, వెలుగు: చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నోటిఫికేషన్లు జారీ చేశాక ఆక్రమణదారులకు ముందుగా నోటీసులు ఇవ్వాలని హైడ్రా, జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలను హైకోర్టు ఆదేశించింది. వాళ్లు చూపించే ఆధారాలు పరిశీలించాకే చర్యలకు దిగాలని సూచించింది. హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా పలు విద్యా సంస్థల యాజమాన్యాలు, బఫర్ జోన్ పరిధిలో ఇండ్లు కట్టుకున్న పలువురు హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలంలోని సర్వే నంబర్ 483 నుంచి 480 వరకు మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 10 ఎకరాలు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 17.20 ఎకరాల్లో ఆక్రమణలున్నాయని పేర్కొంటూ గండిమైసమ్మ ఎమ్మార్వో ఈ నెల 22న వారికి నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చిన్న దామెర చెరువులో 8.25 ఎకరాలు ఆక్రమణలు జరిగాయంటూ తహసీల్దార్ ఇచ్చిన నోటీసుల అమలును ఆపేయాలని కోరారు. చట్టప్రకారం సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. తహసీల్దార్ ఏకపక్షంగా సర్వే చేశారని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ కూడా సరిగ్గా జరగలేదని వివరించారు. మర్రి విద్యా సంస్థల్లో ఐదువేల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారని, కూల్చివేత చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2007లో విద్యా సంస్థల నిర్మాణాలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతులు ఇచ్చారన్నారు.
Also read:-రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురూ..టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు
చెరువులో మురుగు వదులుతున్నరు
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారాలపై దాఖలైన పిల్‌లో చీఫ్ జస్టిస్ బెంచ్.. అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఆక్రమణదారులు చిన్న దామెర చెరువులో మురుగు నీరు వదులుతున్నారని కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. నివేదిక ఆధారంగా ఆక్రమణలు తొలగించాలని సీజే బెంచ్ ఆదేశించిందని గుర్తు చేశారు. ఎఫ్టీఎల్ను ఆక్రమించి విద్యా సంస్థల నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలను కూల్చివేయాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదించారు.
ఆధారాలుంటే హైడ్రాకు చూపించండి: హైకోర్టు
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి కీలక కామెంట్లు చేశారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తహసీల్దార్ ఏడు రోజుల గడువుతో నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కూల్చివేతల కోసం హైడ్రా రంగంలోకి దిగిందంటూ విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. తహసీల్దార్ ఇచ్చిన ఏడు రోజుల గడువు నోటీసులను రద్దు చేస్తున్నామని తెలిపారు. వాటిని షోకాజ్ నోటీసులుగా పరిణించేలా మార్పు చేస్తున్నామని చెప్పారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత హైడ్రా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
నాదం చెరువు రికార్డులతో రండి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రెముల (వెంకటాపూర్)లోని నాదం చెరువుకు చెందిన రికార్డులు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి దాకా పిటిషనర్ల విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ టి.వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ వాదిస్తూ.. అన్ని అనుమతులు తీసుకుని 17.21 ఎకరాల్లో అనురాగ్‌తో పాటు పాటు ఇతర విద్యా సంస్థల ఏర్పాటు జరిగిందన్నారు. చట్టప్రకారం చర్యలు ఉండాలని హైకోర్టు ఆదేశించినా హైడ్రా పట్టించుకోవడం లేదని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా సెలవుల్లోనే కూల్చివేస్తామని చెప్పిన హైడ్రా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. వాదనల విన్న జడ్జి.. రికార్డులు సమర్పించాలని ఆదేశించారు.