కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి హాజరయ్యేలా ఆర్డర్‌‌‌‌ ఇవ్వండి

కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి హాజరయ్యేలా ఆర్డర్‌‌‌‌ ఇవ్వండి
  • హైకోర్టులో తెలంగాణ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫార్మర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ పిల్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌‌‌రావు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేలా ఆర్డర్‌‌‌‌ ఇవ్వాలని హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలైంది. ఈ మేరకు స్పీకర్‌‌‌‌కు, స్పీకర్‌‌‌‌ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫార్మర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు డి. విజయ్‌‌‌‌పాల్‌‌‌‌రెడ్డి గురువారం పిల్‌‌‌‌ ను దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, స్పీకర్‌‌‌‌ కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ ను చేర్చారు. ఈ పిల్‌‌‌‌కు హైకోర్టు రిజిస్ట్రీ నంబర్‌‌‌‌ కేటాయించే అంశం పరిశీలనలో ఉంది.

“ కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ముఖ్యంగా రైతుల సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నేత.. సభకు హాజరుకాకపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. శాసనవ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే పరిధి కోర్టులకు మాత్రమే ఉంది. కోర్టు ముందు మొదటిసారి ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌‌‌‌ విధులు నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త ప్రతిపక్ష నేతను ఎంపిక చేసేలా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలి.

స్పీకర్, స్పీకర్‌‌‌‌ కార్యాలయానికి, కేసీఆర్, కేటీఆర్​కు లీగల్‌‌‌‌ నోటీసులు ఇచ్చినా.. ఎలాంటి చర్యలు లేవు. దీంతో కోర్టులో పిల్‌‌‌‌ దాఖలు చేయాల్సి వచ్చింది. హైకోర్టు తనకున్న అపరిమిత అధికారాలను ఉపయోగించి కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఇందుకు తగిన  ప్రొసీడింగ్స్‌‌‌‌ చేపట్టేలా స్పీకర్‌‌‌‌ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలి”  అని విజయ్‌‌‌‌పాల్‌‌‌‌రెడ్డి తన పిల్‌‌‌‌లో పేర్కొన్నారు.