గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్​కు లైన్ క్లియర్​.. పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్​కు లైన్ క్లియర్​.. పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
  • రిజర్వేషన్ల అంశంపై  పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
  • పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం
  • పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గాలేవు
  • ఆర్టికల్ 226 ప్రకారం తీర్పు వెల్లడిస్తున్నామన్న ధర్మాసనం

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసింది. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. రిజల్ట్స్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.

పిటిషన్లు చాలా ఆలస్యంగా దాఖలు చేయడం, సరైన కారణాలు వివరించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఆర్టికల్ 226 ప్రకారం.. తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక కామెంట్లు చేసింది. ‘‘2022లో వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దు అయ్యింది. దీంతో 2023, ఫిబ్రవరి 19న 563 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్​లో ప్రిలిమినరీ ఎగ్జామ్​పెట్టి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అక్టోబర్​లో మెయిన్స్ నిర్వహించి మెరిట్ లిస్ట్ విడుదల చేసింది.

చాలా ఆలస్యంగా కోర్టులో పిటిషన్లు వేశారు. జీవో 29ను ప్రభుత్వం... అధికారిక వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయకపోవడంతో పిటిషన్లు లేట్ అయ్యాయనడం సరికాదు. సమాచారహక్కు చట్టం ద్వారా ఎందుకు వివరాలు సేకరించలేదు?’’అని పిటిషనర్లను ధర్మాసనం నిలదీసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ జరగాలన్న వాదన చట్టవ్యతిరేకమని అభిప్రాయపడింది. పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేకపోవడంతోనే పిటిషన్లు కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. తమ తీర్పులో వెబ్​నోట్, డీ కోడింగ్ వెబ్​నోట్ అంశాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది. 

జీవో 29పై పిటిషనర్ల సవాల్

2022లో అప్పటి ప్రభుత్వం గ్రూప్‌‌‌‌–1 రిజర్వేషన్ల విషయంలో జీవో 55 జారీ చేసింది. పేపర్‌‌‌‌ లీకేజీ కారణంగా గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌‌‌ రద్దయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. పోస్టుల సంఖ్యను పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తూ జీవో 29 జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం టీజీపీఎస్సీ రూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్‌‌‌‌ అన్నింటిలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు, ఇతరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

జనరల్‌‌‌‌ కేటగిరీ అభ్యర్థులకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ల కేటగిరీల వాళ్లను జనరల్‌‌‌‌ కేటగిరీగా పరిగణిస్తే.. దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్నదని పిటిషన్లల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ.. 2018లో జారీ చేసిన జీవో 10, 2019లో జారీ చేసిన జీవో 96తో పాటు ఈ ఏడాది జారీ చేసిన జీవో 29ను సవాల్ చేస్తూ పిటిషన్‌‌‌‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ సుజోయ్‌‌‌‌ పాల్, జస్టిస్‌‌‌‌ జి.రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల వాదన ఇది..

గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు హైకోర్టులో వాదించారు. ‘‘మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలి. ఆఫీసర్లు వర్టికల్‌‌‌‌గా రోస్టర్‌‌‌‌ పాయింట్లు నిర్ధారిస్తున్నరు. మెయిన్స్‌‌‌‌కు ఎంపిక చేసిన 1:50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటిం చేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1:50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, అంతకు మిం చి మెయిన్స్‌‌‌‌కు ఎంపిక చేశారు.

1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌‌‌‌ నుంచి మెయిన్స్‌‌‌‌కు పిలవాలి. రిజర్వేషన్‌‌‌‌ కేటగిరీల వారీగా అర్హత పరీక్షలకు ఎంపిక చేయాలి. ఉదాహరణకు 209 జనరల్‌‌‌‌ కేటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో 10,540 మందిని మెయిన్స్‌‌‌‌కు ఎంపిక చేశారు. అలాగే, అన్ని కేటగిరీలకూ ఎంపిక చేయాలి. ఇలా చేయకుండా లిస్ట్‌‌‌‌ రెడీ చేశారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు 503 పో స్టుల కు నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయగా, ప్రస్తుతం 563 పో స్టులకు నోటిఫికేషన్‌‌‌‌ జారీ అయ్యింది. రీ నోటిఫికేషన్‌‌‌‌ జీవో 29 చట్టవిరుద్ధం. రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్‌‌‌‌ ఫలితాలు వెల్లడించకుండా టీజీఎస్‌‌‌‌పీఎస్సీకి ఆదేశాలివ్వాలి’’అని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు కోరారు. 

ప్రభుత్వ వాదన ఇలా..

నోటిఫికేషన్‌‌‌‌ నిబంధనలు సవరించడంతో పిటిషనర్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రభుత్వ తరఫు అడ్వకేట్లు వాదించారు. ‘‘రిజర్వేషన్‌‌‌‌ కేటగిరీకి చెందిన వారికి మెరిట్ జాబితాలో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వ్​డ్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. జీవో 29ను సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కూడా తోసిపుచ్చింది.

పేపర్ లీకేజీ కారణంగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం గత ఫిబ్రవరిలో మళ్లీ నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షలు రద్దయ్యాయి. మెయిన్స్‌‌‌‌ ఫలితాల వెల్లడిని అడ్డుకో వద్దు’’అని ప్రభుత్వ తరఫున అడ్వకేట్లు హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు వెల్లడిస్తూ.. పిటిషన్లు కొట్టేసింది.